Mumbai-Pune Expressway traffic fines : “నిబంధనలు పాటించండి” అని మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టే వాహనదారులకు టెక్నాలజీ కొరడా ఝుళిపించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై కేవలం ఒక్క ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏకంగా రూ.470 కోట్ల విలువైన జరిమానాలు విధించారంటే నమ్ముతారా? ఇది అక్షరాలా నిజం. మహారాష్ట్ర రవాణా శాఖ విడుదల చేసిన ఈ లెక్కలు చూసి అందరూ నివ్వెరపోతున్నారు. అసలు ఇంత భారీ మొత్తంలో చలాన్లు విధించడానికి కారణమైన ఆ అత్యాధునిక వ్యవస్థ ఏమిటి..? ఈ చలాన్ల జాతరలో సింహభాగం ఎవరిది..? వసూళ్ల పరిస్థితి ఏంటి..?
కళ్లు బైర్లు కమ్మే అంకెలు: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా పెరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలు! మహారాష్ట్ర రవాణా శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, గత 12 నెలల్లో (జూలై 2024 – జూలై 2025) రికార్డు స్థాయిలో 27.76 లక్షల ఈ-చలాన్లు జారీ అయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 470 కోట్లు. అయితే, ఈ భారీ మొత్తంలో ఇప్పటివరకు వసూలైనది కేవలం రూ. 51 కోట్లు మాత్రమేనని అధికారులు తెలిపారు.
అతివేగమే కారణం: ఈ 95 కిలోమీటర్ల పొడవైన రహదారిపై జారీ అయిన చలాన్లలో అత్యధికం అతివేగం (ఓవర్ స్పీడింగ్) కేసులే.
కార్లదే అగ్రస్థానం: నిబంధనలు ఉల్లంఘించిన వారిలో కార్ల డ్రైవర్లే ముందున్నారు. వారిపై ఏకంగా 17.20 లక్షలకు పైగా ఈ-చలాన్లు జారీ అయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో భారీ గూడ్స్ వాహనాలు (3.27 లక్షలు), బస్సులు (2.48 లక్షలు) ఉన్నాయి.
టెక్నాలజీ రూపంలో ట్రాఫిక్ పోలీసు (ITMS): ఈ చలాన్ల వెనుక ఉన్న అసలు సూత్రధారి ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ITMS). రోడ్డు భద్రతను పెంచి, ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి జూలై 2024లో ఈ వ్యవస్థను ప్రారంభించారు.
పనిచేసే విధానం: ఈ వ్యవస్థలో భాగంగా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 గ్యాంట్రీలు, వందలాది హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తాయి.
చలాన్ జారీ ప్రక్రియ: ఏదైనా వాహనం నిబంధనలను (అతివేగం, తప్పుడు లేన్‌లో వెళ్లడం మొదలైనవి) ఉల్లంఘించినప్పుడు, ఈ కెమెరాలు వెంటనే దాని చిత్రాన్ని, వీడియోను బంధించి ఒక నివేదికను తయారు చేస్తాయి. ఈ నివేదికను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఆపరేటర్ తనిఖీ చేసి, ఆపై RTO అధికారి ఆమోదంతో చలాన్‌ను జారీ చేస్తారు.
హాట్‌స్పాట్.. రవాణాదారుల గోడు: ఎక్స్‌ప్రెస్‌వేలోని 10 కిలోమీటర్ల పొడవైన ‘ఖండాలా ఘాట్’ సెక్షన్‌లోనే అత్యధికంగా అతివేగం చలాన్లు నమోదయ్యాయి. అయితే, ఈ ప్రాంతంలో వేగ పరిమితి చాలా తక్కువగా ఉందని, అందుకే ఎక్కువ చలాన్లు పడుతున్నాయని, వేగ పరిమితిని పెంచాలని రవాణాదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


