Must Regulate Social Media: సోషల్ మీడియా దిగ్గజం, ఎలాన్ మస్క్‌కు చెందిన ‘X’ కార్పొరేషన్‌కు (గతంలో ట్విట్టర్) కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ఆదేశించే ప్రభుత్వ అధికారుల అధికారాలను సవాలు చేస్తూ ‘X’ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. భారత్‌లో సోషల్ మీడియా కంపెనీలు ఎలాంటి నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించలేమని కోర్టు ఈ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
“సోషల్ మీడియాను కచ్చితంగా నియంత్రించాలి. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాల విషయంలో ఇది మరింత అవసరం. అలా చేయడంలో విఫలమైతే, రాజ్యాంగం పౌరులకు అందించిన గౌరవంగా జీవించే హక్కు కాలరాయబడుతుంది,” అని జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏంటి?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, 2000లోని సెక్షన్ 79(3)(బి) కింద ప్రభుత్వ అధికారులు ఇచ్చే కంటెంట్ బ్లాకింగ్ ఆదేశాలను ‘X’ కార్ప్ సవాలు చేసింది. ఈ సెక్షన్ అధికారులకు ఆ అధికారాన్ని ఇవ్వలేదని, కేవలం ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద మాత్రమే, నిర్దిష్టమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించి కంటెంట్‌ను బ్లాక్ చేయాలని ‘X’ వాదించింది. ఈ మేరకు తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను నిరోధించాలని కోరింది.
ALSO READ: Union Cabinet: బిహార్‌కు కేంద్రం వరాల జల్లు.. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు మెడికల్ సీట్ల పెంపు
కోర్టు ఏం చెప్పింది?
అనేక నెలల పాటు వాదనలు విన్న తర్వాత, జస్టిస్ నాగప్రసన్న తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “సమాచారం, దాని వ్యాప్తి లేదా వేగం అనేది ఎప్పుడూ నియంత్రణ లేకుండా వదిలివేయబడలేదు. మాధ్యమం ఏదైనా, దానిపై నియంత్రణ అనేది ఎల్లప్పుడూ ప్రభుత్వ పాలనలో ఒక భాగమే,” అని కోర్టు పేర్కొంది.
భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో అమెరికా న్యాయస్థానాల వాదనలను, అక్కడి ఆలోచనా విధానాన్ని భారత రాజ్యాంగ పరిధిలోకి తీసుకురాలేమని కోర్టు తేల్చి చెప్పింది. “అమెరికా న్యాయపరమైన ఆలోచనా విధానాన్ని భారత రాజ్యాంగ గడ్డపై నాటలేం,” అని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు, చట్టబద్ధమైన ప్రసంగానికి ఒకే విధమైన రాజ్యాంగ రక్షణ ఉండదని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఈ తీర్పుతో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్‌ను నియంత్రించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది.
ALSO READ: Ladakh Protest: లద్దాఖ్‌లో భగ్గుమన్న ఆందోళనలు.. రాష్ట్ర హోదా పోరాటంలో నలుగురి మృతి, లేహ్‌లో కర్ఫ్యూ


