Saturday, November 15, 2025
Homeనేషనల్Robo Judge : న్యాయస్థానాల్లో 'రోబో జడ్జిలు'.. ఏళ్ల తరబడి సాగే కేసులకు చెక్...

Robo Judge : న్యాయస్థానాల్లో ‘రోబో జడ్జిలు’.. ఏళ్ల తరబడి సాగే కేసులకు చెక్ పెట్టేందుకు సర్కార్ మాస్టర్ ప్లాన్!

 AI in Indian judicial system : “వాయిదా” అనే పదం వింటేనే సామాన్యుడికి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా తీర్పు రాని కేసులెన్నో. దేశ న్యాయవ్యవస్థకు పెనుభారంగా మారిన ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ‘రోబో జడ్జి’ల ప్రవేశం. న్యాయస్థానంలో న్యాయమూర్తి స్థానంలో రోబో కూర్చుని తీర్పులు చెబుతుందా..? అసలు ఈ ‘రోబో జడ్జి’లంటే ఎవరు..? ఈ నూతన ప్రయోగం భారత న్యాయవ్యవస్థ స్వరూపాన్నే ఎలా మార్చబోతోంది..?

- Advertisement -

కోట్ల కేసులకు సాంకేతిక పరిష్కారం: ప్రస్తుతం మన దేశంలోని దిగువ కోర్టుల్లో సుమారు 3.6 కోట్లకు పైగా కేసులు పేరుకుపోయి ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారానికి దశాబ్దాల సమయం పట్టేలా ఉంది. ఈ జాప్యాన్ని నివారించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘రోబో జడ్జి’ల విధానానికి శ్రీకారం చుట్టింది.

ఏమిటీ ‘రోబో జడ్జి’ విధానం : ‘రోబో జడ్జి’ అనగానే చాలామంది ఊహించుకున్నట్లు న్యాయమూర్తి స్థానంలో ఓ యంత్రం కూర్చుని “ఆర్డర్.. ఆర్డర్” అని చెప్పదు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక సహాయక వ్యవస్థ. ట్రాఫిక్ ఉల్లంఘనలు, చిన్నపాటి దొంగతనాలు, భూ తగాదాలు వంటి సాధారణ కేసులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని, పాత రికార్డులను, గతంలో వెలువడిన తీర్పులను ఈ ఏఐ టెక్నాలజీ క్షణాల్లో విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా, మానవ న్యాయమూర్తులకు ఒక నిర్ణయానికి రావడానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం న్యాయమూర్తులను తొలగించడం కాదు, వారికి సహాయకారిగా ఉంటూ న్యాయ ప్రక్రియను అనూహ్యంగా వేగవంతం చేయడమే.

విదేశాల్లో మన న్యాయమూర్తులకు శిక్షణ : ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను ముమ్మరం చేసింది. దేశంలోని జిల్లా, సెషన్స్ కోర్టుల న్యాయమూర్తులకు, ఐసీటీ అధికారులకు ఏఐ వాడకంపై ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటికే రెండు బృందాలుగా సుమారు 70 నుంచి 80 మంది సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్టోనియా, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే విజయవంతమైన ఏఐ న్యాయ నమూనాలను అధ్యయనం చేసి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఒక స్వదేశీ వ్యవస్థను నిర్మించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) పర్యవేక్షిస్తోంది.


ఫలితాలనిస్తున్న పైలట్ ప్రాజెక్టులు : ఈ సంస్కరణ ఆవశ్యకతపై న్యాయశాఖ అధ్యయనాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ప్రయోగాత్మకంగా ఏఐ విధానాన్ని అమలు చేసిన దిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కేసుల విచారణ సమయం ఏకంగా 30 శాతం వరకు మెరుగుపడినట్లు తేలింది. అదేవిధంగా, ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థలను వినియోగించిన కోర్టుల్లో రెండేళ్ల వ్యవధిలోనే పెండింగ్ కేసులు 15-20 శాతం తగ్గినట్లు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నప్పుడు, న్యాయవ్యవస్థ మాత్రం పాత పద్ధతుల్లోనే మగ్గిపోవడం సరికాదని, ఏఐ ప్రవేశం అనివార్యమని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ‘రోబో జడ్జి’ అనేది కేవలం ఒక ఆలోచనగా మిగిలిపోకుండా, భారత న్యాయస్థానాల్లో వాస్తవరూపం దాల్చి, సత్వర న్యాయానికి సరికొత్త బాటలు వేయనుంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad