Nasal Vaccine: కోవిడ్‌కు వ్యాక్సిన్లు ఇప్పటివరకు ఇంజెక్షన్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇకపై నాసిల్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అంటే ముక్కులో డ్రాప్స్ వేయడం ద్వారా దీన్ని శరీరంలోకి పంపిస్తారు. మన దేశంలో ఈ తరహా వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ వెల్లడించారు. దీంతో నేటి నుంచి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. కోవిడ్ పోర్టల్ ద్వారా ఈ వ్యాక్సిన్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రైవేటు సెంటర్లలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో ఇకపై ఈ వ్యాక్సిన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని బూస్టర్ డోసుగా కూడా తీసుకోవచ్చు.
అంటే ఇంతకుముందు వేరే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు కూడా వాటితో సంబంధం లేకుండా దీన్ని బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కూడా భారత్ బయోటెక్ సంస్థే రూపొందించింది. ఇంజెక్షన్లన్నా, సూది గుచ్చడమన్నా భయపడే వాళ్లకు ఈ వ్యాక్సిన్ మంచి ఆప్షన్. ఎలాంటి నొప్పి లేకుండా దీన్ని తీసుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీని ధరను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ ప్రజలు బూస్టర్ డోసులు తీసుకోవడంపై ఆసక్తి చూపించవచ్చు.