Sunday, January 18, 2026
Homeనేషనల్ENERGY CONSERVATION : ఇంధనం ఆదా.. భవిష్యత్తుకు భరోసా! నేడు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

ENERGY CONSERVATION : ఇంధనం ఆదా.. భవిష్యత్తుకు భరోసా! నేడు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

National Energy Conservation Day : పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్.. ఇవి లేని జీవితాన్ని ఊహించగలమా? మన ఆధునిక జీవనశైలికి ఇంధనమే ప్రాణాధారం. కానీ, ఈ వనరులు అపరిమితం కాదు. మనం వాడుతున్న కొద్దీ తరిగిపోతున్నాయి, పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు, ప్రతి ఏటా డిసెంబర్ 14న ‘జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం’ జరుపుకుంటున్నాం. అసలు మనం ఇంధనాన్ని ఎలా వృథా చేస్తున్నాం? చిన్న చిన్న మార్పులతో మన భవిష్యత్తును ఎలా కాపాడుకోవచ్చు?

- Advertisement -

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణతో ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఆధ్వర్యంలో 1990 నుంచి ఇంధన పరిరక్షణపై ప్రచారం చేస్తోంది.

పొదుపు పాఠాలు.. మన ఇంటి నుంచే : ఇంధనాన్ని ఆదా చేయడం అనేది ఓ పెద్ద యజ్ఞం కాదు, మన దైనందిన అలవాట్లలో చేసుకునే చిన్న చిన్న మార్పులతోనే ఇది సాధ్యం.


5-స్టార్ రేటింగ్: ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాలు కొనేటప్పుడు, తప్పనిసరిగా 5-స్టార్ రేటింగ్ ఉన్న వాటినే ఎంచుకోండి. దీనివల్ల విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా, విద్యుత్ ఆదా అవుతుంది.
ఆపితేనే ఆదా: అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆపడం అలవాటు చేసుకోండి.
ఎల్‌ఈడీ వెలుగులు: సాధారణ బల్బులకు బదులుగా, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే ఎల్‌ఈడీ బల్బులను వాడండి. ఈ చిన్న మార్పులతో, ఒక కుటుంబం ఏటా 120 నుంచి 170 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.

ఇంధన ఆదా:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇంజిన్ ఆఫ్: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 10 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే, ఇంజిన్‌ను ఆఫ్ చేయండి. ఈ చిన్న పని వల్ల 8% వరకు వాయు కాలుష్యం తగ్గుతుందని అంచనా.
రోజుకు 18 నిమిషాల వృథా: సగటున ఒక వాహనదారుడు రోజుకు 18 నిమి-షాల పాటు అనవసరంగా ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల, ఏటా 100 లీటర్ల ఇంధనం వృథా అవుతోంది.

ప్రత్యామ్నాయాల వైపు పయనం : శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడం అత్యవసరం.
ఎలక్ట్రిక్ వాహనాలు (EV): పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా, కాలుష్యరహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం ఈవీల కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఇస్తోంది.

బయో-ఫ్యూయల్స్: ఇథనాల్, బయోడీజిల్, సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని పెంచాలి. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం అనేది కేవలం డబ్బు ఆదా చేసే విషయం కాదు. అది మన పర్యావరణాన్ని, మన భావి తరాల భవిష్యత్తును కాపాడే ఓ సామాజిక బాధ్యత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News