నేషనల్ హెరాల్డ్(National Herald Case) మనీ లాండరింగ్ కేసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi), లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి(Rahul Gandhi) మరో షాక్ తగిలింది. వీరిద్దరికి ఢిల్లీ పటియాలా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదుల వాదనలు వింటామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఛార్జీషీట్ సరిగా లేదని సోనియా, రాహుల్‌కి నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం జరిగిన విచారణలో ఛార్జీషీట్ పత్రాలు సరిగా ఉన్నాయని పేర్కొంటూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న సామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారి, మెస్సర్స్ యంగ్ ఇండియా, మెస్సర్స్ డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా నోటీసులు పంపించారు.