Saturday, April 19, 2025
Homeనేషనల్National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ ప్రకంపనలు.. సోనియా, రాహుల్‌కు ఈడీ షాక్..!

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ ప్రకంపనలు.. సోనియా, రాహుల్‌కు ఈడీ షాక్..!

ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి వేడి రాజేస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర ఆర్థిక నిబంధనలు అమలు చేసే సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన సుమారు రూ.661 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు ఈడీ ప్రకటించింది.

- Advertisement -

ఈడీ అధికారుల ప్రకారం, జప్తు ప్రక్రియలో భాగంగా ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న కీలక ఆస్తులపై చర్యలు చేపట్టారు. ఇందులో దేశ రాజధానిలోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లో ఉన్న ప్రముఖ “హెరాల్డ్ హౌస్” కూడా ఉంది. ఇది AJLకి చెందిన ప్రముఖ స్థలంగా గుర్తించింది. ఈదీ ఈ చర్యలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 నిబంధనల ప్రకారం, అలాగే 2013లో రూపొందించిన ఆస్తుల స్వాధీనం నియమాల మేరకు చేపట్టినట్లు వెల్లడించింది. నవంబర్ 2023లో ఈ స్థిరాస్తులు తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ, ప్రస్తుతం వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు దూకుడు పెంచింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను వెలువరిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. ఈ యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్ గాంధీలు చెరో 38% వాటాను కలిగి ఉన్నారు. వారు మెజారిటీ వాటాదారులుగా ఉండటం వల్ల, సంస్థ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఉందని ఈడీ చెబుతోంది. ఈడీ ప్రకారం, యంగ్ ఇండియన్ సంస్థ నకిలీ విరాళాలు (రూ.18 కోట్లు), ముందస్తు అద్దె (రూ.38 కోట్లు), అబద్ధపు ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం (రూ.29 కోట్లు) వంటి మార్గాల ద్వారా నేరపూరితంగా ఆదాయాన్ని సమకూర్చిందని ఆరోపించింది. ఇది మనీలాండరింగ్‌కు ఉదాహరణగా భావించి ఆస్తులపై స్వాధీనం చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది.

ఇక ఈ వ్యవహారంపై అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు కింద జరుగుతోందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈడీ చర్యలతో కేసు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ కేసు తిరిగి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ నాయకులపై ఈడీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి.. అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News