Coach sexual harassment on minor girl woman shooter: ఏ రంగంలో ఉన్నా మహిళలపై లైంగిక వేధింపులు తప్పడం లేదు. సహోద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకూ కొందరు మహిళల పట్ల చూసే చూపు.. వారి కెరీర్‌ను నాశనం చేస్తోంది. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ జీవితంలో విజయశిఖరాలకు చేరుకునే లోపు లైంగిక దాడులు వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఇక, క్రీడా రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా హర్యానాలో జరిగిన ఓ సంఘటన.. మహిళా క్రీడాకారుల పట్ల భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
Also Read: https://teluguprabha.net/top-stories/major-road-accident-in-rangareddy-four-students-spot-dead/
ఫరీదాబాద్‌లో జాతీయ షూటింగ్ కోచ్‌పై హర్యానా పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఒక హోటల్ గదిలో తనపై కోచ్ అంకుష్ భరద్వాజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మైనర్(17) జాతీయ స్థాయి మహిళా షూటర్.. కుటుంబీకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించే పనిలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి షూటింగ్ పోటీ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఒక హోటల్ గదిలో భరద్వాజ్.. పనితీరును అంచనా వేసే నెపంతో తనపై దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. భరద్వాజ్‌పై పోలీసులు NIT ఫరీదాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.
Also Read: https://teluguprabha.net/business/gas-cylinder-subsidy-alert-government-mandates-ekyc-completion/
కేసు తీవ్రత దృష్ట్యా నిశితంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, కోచ్ భరద్వాజ్.. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) నియమించిన 13 జాతీయ పిస్టల్ కోచ్‌లలో ఒకరు. తాజాగా అతనిపై ఆరోపణల నేపథ్యంలో NRAI సస్పెండ్ చేసింది. కాగా, ఎవరికైనా చెబితే తన కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గతంలోనూ ఓ మహిళా షూటర్‌ను కోచ్ ఇలాగే వేధించాడని తెలిపింది.

