దేశాన్ని వణికించిన జమ్ముకాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. పర్యాటకులపై జరిగిన దారుణ హత్యాకాండతో కేంద్ర నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ముష్కర ముఠాలు మరిన్ని కీలక ప్రాంతాలపై కన్నేసినట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ముంబైతో పాటు అనేక మెట్రో నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించడంతోపాటు కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. జనాభా గల ప్రాంతాలు, వాణిజ్య కేంద్రీకృత ప్రాంతాలు, ప్రజలు గుంపులుగా చేరే ప్రాంతాల్లో నిఘా పెంచారు. గతంలో జరిగిన గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటనల దృష్ట్యా ఈసారి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ముఖ్య బీచ్ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను మరింత బలపరిచారు. నావికాదళ సహకారంతో ముమ్మాటికీ ముష్కరులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే దిశగా చర్యలు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడి దృష్ట్యా భక్తుల రక్షణ కోణంలో తిరుమలలోని భద్రతను కూడా గణనీయంగా పెంచారు. లక్షలాది మంది తరలివచ్చే తిరుమల కొండపై ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా ఉండేందుకు మాక్ డ్రిల్ చేపట్టారు. సుదర్శన్ సత్రాన్ని కేంద్రంగా చేసుకుని అక్టోపస్, పోలీసు, విజిలెన్స్ బలగాలు కలిసి ఉగ్రదాడిని తిప్పికొట్టే విధానాన్ని ప్రాక్టికల్‌గా ప్రదర్శించాయి.
సాయుధ బలగాలు, శిక్షణ పొందిన శునకాలతో ప్రతి అంతస్తును జల్లెడ పట్టారు. భక్తుల ఆందోళన నివారించేందుకు ముందుగా మైక్ ద్వారా ప్రకటన చేయడం, దాడి పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశమంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, ప్రజల సహకారంతో అప్రమత్తంగా ముందుకు సాగాలని భద్రతా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.