Sunday, November 16, 2025
Homeనేషనల్NCERT : దేశ విభజన పాపం ఆ ముగ్గురిదే... NCERT కొత్త పాఠంపై కాంగ్రెస్...

NCERT : దేశ విభజన పాపం ఆ ముగ్గురిదే… NCERT కొత్త పాఠంపై కాంగ్రెస్ భగ్గు!

NCERT India partition controversy : భారత ఉపఖండ చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టమైన దేశ విభజనకు అసలు కారకులు ఎవరు..? దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రశ్నకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తనదైన శైలిలో సమాధానం చెప్పింది. దేశ విభజన పాపంలో మహ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్‌బాటన్‌లతో పాటు భారత జాతీయ కాంగ్రెస్‌కు కూడా భాగముందని తేల్చిచెబుతూ ఓ కొత్త పాఠ్యాంశాన్ని (మాడ్యూల్) విడుదల చేసింది. ఈ చర్య, దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. చరిత్రను కాషాయీకరణ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు NCERT తన పాఠంలో ఏం చెప్పింది…? కాంగ్రెస్ అభ్యంతరాలు ఏమిటి..?

- Advertisement -

ఏమిటీ కొత్త పాఠం : పాఠశాల విద్యార్థుల్లో దేశ విభజన నాటి గాయాలు, ప్రజల త్యాగాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో NCERT ఈ సప్లిమెంటరీ మాడ్యూల్‌ను రూపొందించింది. ఇది రెగ్యులర్ పాఠ్యపుస్తకాలకు అదనం. 6-8, 9-12 తరగతులకు వేర్వేరుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీనిని అందుబాటులోకి తెచ్చింది.

ముగ్గురు బాధ్యులు: దేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ దానిని అంగీకరించడం, వైస్రాయ్ మౌంట్‌బాటన్ దానిని అమలు చేయడం అనే మూడు అంశాలు ప్రధాన కారణాలని పాఠంలో పేర్కొన్నారు.

జిన్నా రెచ్చగొట్టే ప్రసంగం: 1940 లాహోర్ ముస్లిం లీగ్ సమావేశంలో “హిందువులు, ముస్లింలు వేర్వేరు మతాలు, సంస్కృతులు కలిగిన వారు, కలిసి ఉండలేరు” అంటూ జిన్నా చేసిన ప్రసంగమే విభజన బీజాలు నాటిందని వివరించింది.

నెహ్రూ, పటేల్ అభిప్రాయాలు: విభజనను సర్దార్ పటేల్ “అనివార్యమైన చేదు ఔషధం”గా, జవహర్‌లాల్ నెహ్రూ “తప్పు కానీ తప్పనిసరి” అని అభివర్ణించినట్లు మాడ్యూల్‌లో పొందుపరిచారు.

కశ్మీర్ సమస్య: దేశ విభజన కారణంగానే కశ్మీర్ సమస్య ఉద్భవించిందని, ఇది నేటికీ భారత విదేశాంగ విధానానికి ఆటంకంగా మారిందని NCERT విశ్లేషించింది.

కాంగ్రెస్ ఎదురుదాడి : NCERT మాడ్యూల్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది చరిత్రను వక్రీకరించడమేనని, వాస్తవాలను దాచిపెట్టి విద్యార్థుల మనసులను కలుషితం చేసే ప్రయత్నమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. “దేశంలో లౌకికవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని చూస్తున్న ఆరెస్సెస్, ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. వారి భావజాలాన్ని NCERT ద్వారా పిల్లలపై రుద్దాలని చూస్తున్నారు. ఇది సిలబస్‌ను కాషాయీకరణ చేయడమే,” అని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా సిలబస్ నుంచి పలు కీలక అంశాలను తొలగించినప్పుడు తాము వ్యతిరేకించామని, ఇప్పుడు ఈ చర్య దాని కొనసాగింపేనని ఆయన ఆరోపించారు. ఈ కొత్త పాఠ్యాంశం ఇప్పుడు విద్యారంగంలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad