NDA performance in Bihar elections : బిహార్ ఎన్నికల మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్, అధికార ఎన్డీఏ కూటమి భవితవ్యంపై నీలినీడలు కమ్ముతోంది. ఈ అధిక పోలింగ్ శాతం, ప్రభుత్వ వ్యతిరేకతకు నిలువుటద్దమని విపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ క్రమంలో, ‘ఇండియా’ కూటమి భాగస్వామి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య సంచలన జోస్యం చెప్పారు. ఎన్డీఏ కూటమికి వంద సీట్లు కూడా దాటవని, ‘ఇండియా’ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమంటున్న ఆయన, ప్రధాని మోదీ ప్రసంగాలపై సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఆయన విశ్లేషణ ఏంటి? ఏ ప్రాతిపదికన ఈ జోస్యం చెప్పారు?
వంద లోపే ఎన్డీఏ.. కారణమిదే : ఆదివారం విలేకరులతో మాట్లాడిన దీపాంకర్ భట్టాచార్య, తొలి దశ పోలింగ్ సరళిని విశ్లేషించారు. “మొదటి దశలో 121 స్థానాలకు 65 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం చారిత్రాత్మకం. ఇది ప్రజల్లో ఉన్న తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. ఈ లెక్కన, 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం వంద లోపే పరిమితం కావడం ఖాయం. ‘ఇండియా’ కూటమి 140 నుంచి 150 స్థానాలతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది,” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానిది ‘కట్టా’ భాష.. యూపీ సీఎంది ‘బుల్డోజర్’ భయం : ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించిన భాషపై దీపాంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ‘కట్టా’ (నాటు తుపాకీ) వంటి పదాలు వాడటం విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది అచ్చంగా ‘అండర్‌వరల్డ్’ భాషలా ఉంది. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికల సభల్లో ‘బుల్డోజర్’ ప్రస్తావన తెస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు,” అని ఆయన ఆరోపించారు.
‘ఓట్ల దొంగతనం’పై ప్రజలు తిరగబడ్డారు
‘ఓట్ల దొంగతనం’ (Vote Chori) జరుగుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలకు ఆయన మద్దతు పలికారు. “మూడు రకాలుగా ఓట్లను దొంగిలిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం, దొంగ ఓట్లు వేయించడం. అయితే, బిహార్ ప్రజలు చాలా చైతన్యవంతులు. తొలి దశలో ఇలాంటి ప్రయత్నాలను వారు చురుగ్గా అడ్డుకున్నారు,” అని భట్టాచార్య పేర్కొన్నారు.
తేజస్వీ హామీలు అసాధ్యం కాదు : “ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం” ఇస్తానన్న తేజస్వీ యాదవ్ హామీని అసాధ్యమని ఎద్దేవా చేస్తున్న ఎన్డీఏ నేతలపై ఆయన మండిపడ్డారు. “ఈ హామీని నెరవేర్చడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ అది అసాధ్యమని కొట్టిపారేయడం సరికాదు. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేనివారే ఇలాంటి సాకులు చెబుతారు,” అని అన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యను ప్రధాన అస్త్రంగా మలిచిన తేజస్వీని ఆయన ప్రశంసించారు.
అవినీతి ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమైనవని, మహిళా ఓటర్లలో కూడా ప్రభుత్వ పథకాలపై అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. “పది వేల రూపాయలు మాకొద్దు, రుణమాఫీనే మాకు ముద్దు” అంటూ మహిళలు నినదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


