NDA Meeting: కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నేడు దిల్లీలో ఎన్డీయే కూటమి భేటీకానుంది. దేశంలో ఎన్నికైన ప్రధానుల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరగనున్న ఈ మహాసభలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మొత్తం 35 ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుండి సుమారు 75 మంది అగ్రనేతలు ఈ చారిత్రాత్మక సమావేశంలో భాగస్వాములు కానున్నారు.
మోదీ నాయకత్వానికి కృతజ్ఞతల తీర్మానం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు: ఈ సమావేశంలో ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనను అభినందిస్తూ.. ఎన్డీయే పక్షాల తరపున ఏపీ సీఎం చంద్రబాబు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో బలపరచనున్నారు. పలువురు ఎన్డీయే పక్షాల నేతల ప్రసంగాల అనంతరం.. తీర్మానానికి ఆమోదం తెలిపాక ప్రధాని నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి దిశా నిర్దేశం చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు: సుదీర్ఘ కాలంగా భారత ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలు దేశాల అధినేతలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ అధికారిక లేఖ రాయగా.. పపువా న్యూగినీ ప్రధాని జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సెసార్ తదితర ప్రపంచ నేతలు మోదీ నాయకత్వానికి అభినందనల వర్షం కురిపించారు.

