Bihar Cabinet 2025: బిహార్ రాజకీయాల్లో మరోసారి నితీశ్ కుమార్ ప్రాముఖ్యత తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా బయటపడింది. ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొంత ఆధిక్యం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జేడీయూ లేనిదే కూటమి సుస్థిరంగా ఉండదని ఎన్డీయే అగ్రనేతలు అర్థం చేసుకున్నారు. అందువల్ల రెండు పార్టీలకు సమాన మంత్రిత్వ భాగస్వామ్యం ఇవ్వడం వెనుక వ్యూహాత్మక ఆలోచన దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్న శక్తివంతమైన నాయకత్వం ఉన్నా,.. బిహార్‌లో స్థానిక సమీకరణలు ఎల్లప్పుడూ జేడీయూకు మద్దతుగా నిలుస్తాయనే వాస్తవం పార్టీని సర్దుబాట్ల దిశగా నడిపించిందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా నితీశ్ కుమార్ బీజేపీతో విభేదించి మళ్లీ కలిసే రాజకీయ వ్యూహాన్ని నిర్మించారు. ఈసారి కూడా ప్రభుత్వంలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా ఆయనను మరోసారి సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది ఎన్నికల తర్వాత భవిష్యత్తులో కూటమి స్థిరత్వానికి పరీక్షగా కూడా భావించవచ్చు. మంత్రివర్గ కూర్పు సరిగా జరగకపోతే.. అంతర్గత అసంతృప్తి జేడీయూ-బీజేపీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చిరాగ్ పస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు రెండు శాఖలు ఇవ్వడం కూడా సామాజిక సమతుల్యత దృష్ట్యా కీలకమని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నాయకులు మొదలుపెట్టిన ఈ సమతుల్య సమీకరణ ప్రయత్నం.. 2025 తర్వాతి రాజకీయ దిశను నిర్ణయించే పరిణామంగా మారవచ్చు. నితీశ్ కుమార్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ కేవలం రాష్ట్ర రాజకీయాలకే కాక.. జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోందని తాజా ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.

