Homeనేషనల్NEET re-exam : నీట్ నిబంధనలు కఠినం: నిమిషం లేటైనా 'నో ఎంట్రీ'.. జూన్ 21న...

NEET re-exam : నీట్ నిబంధనలు కఠినం: నిమిషం లేటైనా ‘నో ఎంట్రీ’.. జూన్ 21న కట్టుదిట్టంగా రీ-ఎగ్జామ్!

NEET UG 2026 re-exam guidelines : వైద్య వృత్తే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్థులకు ఇది అత్యంత కీలక సమయం. కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల కలలను ‘ఒక్క నిమిషం’ ఆలస్యం ఆవిరి చేసే ప్రమాదం ఉంది. జూన్ 21న (ఆదివారం) జరగనున్న ‘నీట్ (NEET) యూజీ- 2026 రీ-ఎగ్జామ్’ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనల అమలులో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. 

- Advertisement -

సమయపాలన అత్యవసరం.. నిమిషం దాటితే గేట్లు క్లోజ్ : నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను ముందే అంచనా వేసుకుని ఇంటి నుంచి త్వరగా బయలుదేరడం ఉత్తమం. ఎందుకంటే, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి ‘నో ఎంట్రీ’ అని ఎన్టీఏ తేల్చి చెప్పింది.
ఉదయం 11 గంటలకు: పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 11 గంటల నుంచే విద్యార్థుల ప్రవేశం, భద్రతా తనిఖీలు  ప్రారంభమవుతాయి. లక్షలాది మంది హాజరయ్యే పరీక్ష కాబట్టి తనిఖీలకు ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే చేరుకోవాలి.
మధ్యాహ్నం 1:30 గంటలకు: సరిగ్గా ఒంటిగంటన్నరకు పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారాలు మూసివేస్తారు. ఆ తర్వాత ఎలాంటి సాకు చెప్పినా లోపలికి అనుమతించరు.
మధ్యాహ్నం 1:40 గంటలకు: గేటు దాటిన ప్రతి అభ్యర్థి ఈ సమయానికి తనకు కేటాయించిన ఎగ్జామ్ హాల్‌లోని సీట్లో ఆశీనులు కావాలి.
మధ్యాహ్నం 1:55 గంటలకు: ఇన్విజిలేటర్లు టెస్ట్ బుక్‌లెట్లను పంపిణీ చేస్తారు. ఈ ఐదు నిమిషాల సమయంలో విద్యార్థులు బుక్‌లెట్ కోడ్, పేజీల సంఖ్య సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా సాంకేతిక లోపాలు, చిరిగిన పేజీలు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పి మార్చుకోవాలి.
మధ్యాహ్నం 2:00 గంటలకు: పరీక్ష ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:15 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగుతుంది. అయితే నిబంధనల ప్రకారం.. దివ్యాంగులకు (PwBD) అదనపు సమయం కింద సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.

విద్యార్థులకు ఊరట: రఫ్ వర్క్‌కు 4 పేజీలు : గత పరీక్షల్లో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఈసారి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లెక్కలు చేసుకునేందుకు (రఫ్ వర్క్) కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. ఈసారి ఆ సంఖ్యను నాలుగుకు పెంచింది. భౌతికశాస్త్రం (Physics), రసాయనశాస్త్రం (Chemistry) విభాగాల్లోని క్లిష్టమైన సమీకరణాలను సాధించడానికి, జీవశాస్త్రం (Biology) లో రేఖాచిత్రాలు గీసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి ఈ అదనపు పేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అభ్యర్థులు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా జవాబులు రాబట్టవచ్చు.

వదంతులు నమ్మకండి.. డాక్యుమెంట్లు మరువకండి : పరీక్ష సమయం దగ్గరపడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం పరిపాటిగా మారింది. అటువంటి ఫేక్ వార్తలను, తప్పుడు సందేశాలను ఏమాత్రం నమ్మవద్దని ఎన్టీఏ గట్టిగా హెచ్చరించింది. ఏ సమాచారమైనా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే నిర్ధారించుకోవాలని సూచించింది. పరీక్ష రోజున అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఒరిజినల్ అడ్మిట్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును తీసుకెళ్లాలి. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి విజయం సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News