Homeనేషనల్NEET : నీట్ ‘రీ’ రాసే వేళ.. ఎన్‌టీఏ కొత్త లీలా! పరీక్షా సమయం పెంపు.....

NEET : నీట్ ‘రీ’ రాసే వేళ.. ఎన్‌టీఏ కొత్త లీలా! పరీక్షా సమయం పెంపు.. రఫ్ పేజీలు రెట్టింపు!

NEET UG 2026 re-exam guidelines : వైద్య విద్యా కలల సౌధానికి తొలి మెట్టు అయిన ‘నీట్’ (NEET UG 2026) పరీక్షా రంగంపై ఎట్టకేలకు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పేపర్ లీకేజీల పర్వంతో అప్రతిష్ఠపాలైన ప్రతిష్ఠాత్మక పరీక్షను ఈ నెల 21న మళ్లీ (Re-exam) నిర్వహించబోతున్న తరుణంలో, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని విప్లవాత్మక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా సమయాన్ని పెంచడం, రఫ్ వర్క్ కోసం కేటాయించే పేజీలను రెట్టింపు చేయడం వంటి నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల ఆవేదనను ఆలకించిన ఎన్‌టీఏ, ఈసారి ఎడమచేతి వాటం ఉన్న అభ్యర్థుల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించడం విశేషం. 

- Advertisement -

సమయపాలనలో సమూల మార్పులు: 15 నిమిషాల వెసులుబాటు పరీక్ష హాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అభ్యర్థులకు కాలంతో పోటీ తప్పదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించేలా ఎన్‌టీఏ పరీక్షా వ్యవధిని పెంచింది.  గతంలో కంటే అదనంగా మరో 15 నిమిషాల సమయాన్ని ఎన్‌టీఏ కేటాయించింది. ఈ నెల 21న (జూన్ 21, 2026) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు ఇప్పుడు మొత్తం 195 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

ఇన్విజిలేషన్ ప్రక్రియకు ఊరట: పరీక్ష ప్రారంభంలో, ముగింపులో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల నుంచి సంతకాలు సేకరించడం, ఇతర గుర్తింపు ప్రక్రియల వల్ల విద్యార్థుల అసలు పరీక్షా సమయం హరించుకుపోతోందని గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ గోరుచుట్టుపై రోకటిపోటు లాంటి సమస్యను పరిష్కరించడానికే ఈ 15 నిమిషాల అదనపు సమయాన్ని సర్దుబాటు చేసినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

రఫ్ వర్క్ పేజీలు రెట్టింపు: లెక్కల లడాయికి చెక్! : నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లోని క్లిష్టమైన సమస్యలను సాధించడానికి (రఫ్ వర్క్) గతంలో కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. పేజీలు చాలక విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. ఈ సమస్యకు ఎన్‌టీఏ చరమగీతం పాడింది. ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ కోసం కేటాయించే పేజీలను 2 నుంచి 4 పేజీలకు పెంచారు.

ముందూ వెనుకా అమరిక: కేవలం బుక్‌లెట్ చివరన మాత్రమే కాకుండా, ఇప్పుడు ముందూ వెనుకా పేజీలను సర్దుబాటు చేశారు. సూచనల (Instructions) పేజీ తర్వాత వెంటనే 2 పేజీలు, అలాగే బుక్‌లెట్ చివరలో మరో 2 పేజీలు ఉంటాయి.

భాషా వెర్షన్లు: ఈ నూతన విధానం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు తదితర ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లలోనూ అమలు కానుంది.

ఎడమచేతి వాటం (Left-handers) అభ్యర్థులకు వరం: మొత్తం విద్యార్థుల్లో దాదాపు 10 శాతం మంది ఉండే ఎడమచేతి వాటం ఉన్న అభ్యర్థులకు పేజీలు తిరగేయడం ఇబ్బందిగా మారకుండా ఉండేందుకే బుక్‌లెట్ ప్రారంభంలో, ముగింపులో రెండేసి పేజీల చొప్పున రఫ్ పేపర్లను అమర్చినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

లీకేజీల తుఫాను – దిద్దుబాటు చర్యల వెనుక అసలు కథ : గత మే 3న జరిగిన నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఎన్‌టీఏ ప్రతిష్ఠను గంగలో కలిపింది. ప్రతిపక్షాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయడం, సుప్రీంకోర్టు వరకు వివాదం వెళ్లడంతో పరీక్షను రద్దు చేసి జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం సీబీఐ (CBI) ఈ లీకేజీల నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News