NEET UG CBT: పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నీట్- యూజీ పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పరీక్షను మరోసారి జూన్ 21న నిర్వహించాలని NTA నిర్ణయించింది. అయితే ఇప్పటివరకూ ఆఫ్‌లైన్ పరీక్షా విధానంలో నీట్- యూజీ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2027 నుంచి నీట్- యూజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా ప్రకటించారు.
నీట్ పరీక్షలో ఓఎంఆర్ షీట్ల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, జూన్ 21న నిర్వహించే నీట్ రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని.. పాత ఫీజును ఎన్టీఏ రీఫండ్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యార్థులే తమ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. నీట్ రీఎగ్జామ్‌కి అదనంగా 15 నిమిషాల సమయం అందిస్తున్నట్లు వివరించారు. ఇక, పేపర్ లీకేజీకి కారణమైన బాధ్యులపై, ఎగ్జామ్ మాఫియాపై సీబీఐ విచారణ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

