NEET UG Computer Based Test Supreme Court Affidavit : నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చేందుకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్‌ను సమర్పించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ప్రశ్నపత్రం ముద్రణ స్థానం నుంచి విద్యార్థి చేతికి అందే వరకు ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిరంతరం నిఘా ఉంచేందుకు “ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీ మోడల్” ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాత్కాలిక ఉపశమనాలతో కాలం వెళ్లదీయకుండా, శాశ్వత సంస్థాగత సంస్కరణలు దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.
ఇప్పటివరకు ఓఎమ్‌ఆర్ (OMR) షీట్ల ఆధారంగా జరుగుతున్న నీట్ పరీక్ష విధానంలో మానవ ప్రమేయం ఎక్కువగా ఉండటంతో ఆక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. దీనిని అధిగమించడానికి..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): పరీక్షను ఆన్‌లైన్ విధానంలోకి మార్చే అంశం అన్ని భాగస్వామ్య వర్గాల క్రియాశీల పరిశీలనలో ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ మాదిరిగా నీట్‌ను కూడా ఒకే దశలో లేదా రెండు దశల రూపంలో నిర్వహించే సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నారు. పారదర్శకతను పెంచేందుకు వేర్వేరు విడతల్లో పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కేంద్రం రెండు ప్రధాన కమిటీల మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకుంటోంది.
నందన్ నిలేకణి టాస్క్‌ఫోర్స్: సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణుడైన నిలేకణి నేతృత్వంలోని హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్ త్వరలోనే ఆన్‌లైన్ నిర్వహణపై సమగ్ర సిఫార్సులు అందజేయనుంది.
రాధాకృష్ణన్ కమిటీ: ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నపత్రాల భద్రత, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మౌలిక వసతుల పటిష్టతపై అందించిన పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నారు.

