Friday, July 11, 2025
Homeనేషనల్Nehal Modi Arrested In US: నేహల్ మోదీకి అమెరికాలో సంకెళ్లు.. త్వరలో భారత్‌కు అప్పగింత!

Nehal Modi Arrested In US: నేహల్ మోదీకి అమెరికాలో సంకెళ్లు.. త్వరలో భారత్‌కు అప్పగింత!

PNB Case Sees Key Development: భారత బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. అతని తమ్ముడు నేహల్ దీపక్ మోడీని అమెరికాలో తాజాగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో… అరెస్టుతో రూ. 13,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో భారత్‌కు అప్పగింత ప్రక్రియ వేగవంతం కానుందా? నేహల్ మోదీ పాత్ర ఎంత? భారత్‌కు తీసుకురావడానికి ఎలాంటి అడ్డంకులున్నాయి? 

- Advertisement -

మనీలాండరింగ్ కేసులో పురోగతి:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13,000 కోట్ల మేర రుణాలు తీసుకుని, అక్రమ నగదు చలామణికి పాల్పడిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అతను భారత్ నుంచి లండన్‌కు పారిపోయాడు. అయితే, నీరవ్‌తో పాటు అతని సోదరుడు నేహల్‌కు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అందుకే భారత ప్రభుత్వం నేహల్‌ను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చింది. బెల్జియం పౌరుడైన నేహల్ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నాడు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు,  జులై 4న అమెరికన్ అధికారులు నేహల్ దీపక్ మోదీని అదుపులోకి తీసుకున్నట్లు  యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ధ్రువీకరించింది. ఇది PNB కుంభకోణం కేసులో ఒక కీలక ముందడుగుగా పరిగణిస్తున్నారు.

భారత్ అప్పగింతకు సంబంధించిన నిబంధనలు:

అమెరికా ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నేహల్ మోడీని భారత్‌కు అప్పగించే అంశం రెండు ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, 2002 మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ 3 కింద నేహల్‌పై ఒక కేసు నమోదైంది. రెండవది, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బీ (క్రిమినల్ కుట్ర), 201 (ఆధారాల ధ్వంసం) కింద అతనిపై క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. ఈ రెండు కేసులు అప్పగింత ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.

దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం:

దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం ఒకటి. ఇందులో నీరవ్ మోదీతో పాటు నేహల్ మోదీ “మోస్ట్ వాంటెడ్” నిందితులుగా ఉన్నారు. నీరవ్ మోదీ PNB నుంచి రుణం తీసుకుని, దానితో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డాడు. భారత చట్టాలను ఉల్లంఘించి, షెల్ కంపెనీలను సృష్టించి, విదేశీ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నీరవ్ యూకేకు పారిపోయాడు.  నీరవ్ మోదీ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్‌లో  బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలిపింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేయగా, 2019 మార్చిలో నీరవ్ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలో భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, తనను భారత్‌కు అప్పగించే విషయాన్ని సవాలు చేస్తూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది.

నేహల్ దీపక్ మోదీ పాత్ర:

మరోవైపు, ఈ మనీ లాండరింగ్ కేసులో నేహల్ దీపక్ మోదీ కూడా కీలక పాత్ర పోషించాడని CBI, ED దర్యాప్తులో వెల్లడైంది. నేహల్ అక్రమ నిధులను దాచడంలో, వాటిని బదిలీ చేయడంలో, కీలక ఆధారాలను ధ్వంసం చేయడంలో నీరవ్‌కు సాయం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అందుకే అతనిని భారత్‌కు అప్పగించాలని భారత్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

భారత్‌కు అప్పగింత ప్రక్రియ:

2025 జులై 17న, భారత్‌కు నేహల్ మోదీని అప్పగించే విషయమై తదుపరి విచారణ  జరగనుంది. ఆ రోజే “స్టేటస్ కాన్ఫరెన్స్” కూడా జరుగుతుంది. అయితే, విచారణ సమయంలో నేహల్ మోడీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, కానీ ఆ బెయిల్‌ను యూఎస్ ప్రాసిక్యూషన్ తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది భారత్‌కు ఒక శుభ పరిణామంగా పరిగణిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News