Indians return from Nepal : జెన్-జెడ్ నిరసనలతో అట్టుడికిన నేపాల్ నెమ్మదిగా కుదుటపడుతోంది. హింసాత్మక ఘటనలతో మూతపడిన ఇండో-నేపాల్ సరిహద్దులు తిరిగి తెరుచుకోవడంతో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తిరుగు ప్రయాణం మొదలైంది. కట్టుబట్టలతో, కళ్లల్లో భయంతో, గుండెల్లో అల్లర్ల గాయాలతో వేలాది మంది స్వదేశానికి చేరుకుంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 5,000 మందికి పైగా భారతీయులు సరిహద్దు దాటి రావడం, అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతకీ ఆ వలస కార్మికులు అక్కడ ఎదుర్కొన్న నరకం ఎలాంటిది..?
సాధారణ స్థితికి.. మొదలైన రాకపోకలు : సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన యువత నిరసనలు, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో మూసివేసిన ఇండో-నేపాల్ సరిహద్దును, బుధవారం నుంచి కఠినమైన తనిఖీలతో పాక్షికంగా తెరిచారు. తొలుత భారత పౌరులను, ఆ తర్వాత సరుకు రవాణా వాహనాలను అనుమతిస్తున్నారు.
“భారతీయులు సరిహద్దు దాటి రావడం క్రమంగా పెరుగుతోంది. భద్రతను కట్టుదిట్టం చేశాం,” అని డార్జిలింగ్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
గణాంకాలు చెబుతున్న వాస్తవం : సిలిగురి సమీపంలోని పానిటాంకి, మిరిక్‌లోని పశుపతి సరిహద్దుల వద్ద రాకపోకలు కొనసాగుతున్నాయి.
పానిటాంకి ద్వారా: బుధవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మొత్తం 2,391 మంది భారత్‌లోకి ప్రవేశించారు.
పశుపతి ద్వారా: బుధవారం నుంచి శుక్రవారం వరకు సుమారు 1,900 మంది భారత్‌కు చేరుకున్నారు. మొత్తం మీద, కేవలం నాలుగు రోజుల్లోనే 5,000 మందికి పైగా భారతీయులు (ఎక్కువగా వలస కార్మికులు) స్వదేశానికి తిరిగి వచ్చారు.
కార్మికుల కన్నీటి గాథలు : డబ్బు సంపాదించాలనే ఆశతో నేపాల్ వెళ్లిన వలస కార్మికులు, తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను కన్నీటితో వివరిస్తున్నారు.
“నేపాల్‌లోని దులాబారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. అల్లర్లు మొదలవగానే, యజమానులు ఫ్యాక్టరీ మూసేసి వెళ్లిపోయారు. రెండు రోజులు తినడానికి తిండి లేదు, భయంతో నడుచుకుంటూ సరిహద్దుకు చేరుకున్నాను.”
– ఓ వలస కార్మికుడు
అల్లర్లలో భారత మహిళ మృతి : ఈ నిరసనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ భారత మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన రాజేశ్ దేవి గోలా (57), రాంవీర్ సింగ్ గోలా దంపతులు, కాఠ్‌మాండూలో బస చేసిన హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు, కర్టెన్ సాయంతో నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగే ప్రయత్నంలో రాజేశ్ దేవి జారిపడి మృతి చెందారు. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


