మేనల్లుడిని దాదాపు రాజకీయ వారసుడి రేంజ్ లో ప్రమోట్ చేసి, ఎంకరేజ్ చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కానీ ఏనాడూ తన మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత అని మాత్రం చెప్పలేదు శరద్ పవార్. కుమారులు లేకపోవటంతో తన గారాలపట్టి సుప్రియ సూలేను పార్లమెంట్ కు పంపినప్పటికీ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలను ఆద్యంతం చూసే అధికారం, చొరవ మాత్రం అజిత్ కే ఇచ్చారు పవార్. దీంతో మామ తరువాత పార్టీ తనదే అనేలా అజిత్ పవార్ భవిష్యత్ కార్యాచరణలు రెడీగా పెట్టుకున్నారు.
ఓవైపు క్యాన్సర్ తో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న శరద్ పవార్ ఎంతకీ రాజకీయ వారసత్వంపై ఎటూ తేల్చటం లేదు. మరోవైపు తన చేతికి పదేపదే వస్తున్న అవకాశాలు వదులుకునే ఇష్టంలేని అజిత్ పవార్ ఎట్టకేలకు మామను కాదని, పార్టీలోని ప్రజాప్రతినిధులను పోగేసుకునిమరీ బీజేపీ-శివసేన చీలిక వర్గ సర్కారులో చేరి, ఉపముఖ్యమంత్రి అయిపోయారు. ఓవైపు సుప్రియ-ప్రఫుల్ పటేల్ కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పినా మరో నమ్మినబంటుగా ఇన్ని దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన ప్రఫుల్ కూడా అజిత్ పవార్ తో ఉంటూనే రాజకీయ భవిష్యత్ అని ఫిక్స్ అయి, అజిత్ పవార్ డిప్యుటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరై షాక్ ఇచ్చారు. నిజానికి ఇప్పుడు ఎన్సీపీ మొత్తం ఖాళీ. అంటే మొన్న శివసేనలో ఏం జరిగిందో, షిండే ఏం చేశారే అచ్చం అదే చేసి చూపారు అజిత్ పవార్. కాకపోతే తనదైన శైలిలో అజిత్ సింపుల్ గా పనికానిచ్చేశాడని, దీనిపై పూర్తి క్లూ లేని శరద్ పవార్ ఈ పండు వయసులో పార్టీని పునర్నిర్మిస్తానని బీరాలు పలికి సైలెంట్ అవ్వాల్సిన దుస్థితి దాపురించింది. రాజకీయ వారసత్వం కోసం, అధికారం కోసం తన మేనల్లుడు తనపై తిరుగుబాటు చేయటం ఖాయమని కొద్ది నెలలక్రితమే కళ్లు తెరుచుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోవటంతో శరద్ పవార్ చేతులు కట్టుకుని కూర్చుండిపోవాల్సి వచ్చిందనేది అసలు విషయం. 82 ఏళ్ల వయసులో, అదికూడా క్యాన్సర్ తో బాధపడుతున్న శరద్ పవార్ పార్టీని మళ్లీ శిథిలాల నుంచి లేపటం అసాధ్యమని మరాఠా రాజకీయాలెరిగినవారెవరైనా ఇట్టే చెప్పగలరు. పవార్ చేతుల్లో ఉన్న పవర్ అంతా అజిత్ పవార్ డిప్యుటీ సీఎంగా ప్రమాణస్వీకారానికి హాజరైన ఎన్సీపీ నేతలను బహిష్కరించటమే. అందుకే ఇప్పుడు ఇదే పనిలో బిజీగా ఉన్న రాజకీయ కురువృద్ధుడైన పవార్, వారందిరినీ ఒక్కక్కరినే సస్పెండ్ చేస్తూ, బిజీగా ఉన్నారు.