Homeనేషనల్Maggi noodles : మ్యాగీలో పురుగుల కలకలం: నెట్టింట ప్రచారంపై నెస్లే పక్కా క్లారిటీ!

Maggi noodles : మ్యాగీలో పురుగుల కలకలం: నెట్టింట ప్రచారంపై నెస్లే పక్కా క్లారిటీ!

Maggi noodles infestation rumors : చిన్నా పెద్దా తేడా లేకుండా కడుపు మాడినప్పుడు ఠక్కున గుర్తొచ్చేది ‘మ్యాగీ’. రెండు నిమిషాల్లో గుమగుమలాడుతూ తయారయ్యే ఈ నూడుల్స్ అంటే దేశవ్యాప్తంగా కోట్ల మందికి మహా ఇష్టం. అయితే, అత్యంత ఇష్టంగా తినే ఈ మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు ఉలిక్కిపడ్డారు. జాతీయ స్థాయి స్టాక్ ఎక్స్ఛేంజీలు సైతం వివరణ కోరే స్థాయికి ఈ వ్యవహారం ముదిరింది.

- Advertisement -

దొంగ దెబ్బ.. సోషల్ మీడియా ప్రచారం : ఎక్స్ వేదికగా ఓ ధ్రువీకరించని అనామక ఖాతా నుంచి మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై జూన్ 12న పలు మీడియా సంస్థల్లో కథనాలు రావడం, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) సైతం అప్రమత్తం కావడంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు నెస్లే ఇండియాను వివరణ కోరాయి. దీనిపై నెస్లే దీటుగా స్పందించింది. ఇదంతా కట్టుకథ అని, కేవలం నిరాధారమైన ఆరోపణలు మాత్రమేనని స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

ఆధారాల్లేవు.. అడ్రస్ గల్లంతు : ఆరోపణలు చేసిన వ్యక్తి వద్ద కనీస ఆధారాలు లేవని నెస్లే స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడిని సంప్రదించి, పురుగులు ఉన్నాయంటున్న శాంపిల్‌ను అడిగే ప్రయత్నం చేయగా.. అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని సంస్థ పేర్కొంది. ఆశ్చర్యకరంగా, ఆ ఆరోపణలు చేసిన సోషల్ మీడియా ఖాతా కూడా ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయిందని (డిలీట్ చేశారని) వివరించింది. దీన్ని బట్టే సదరు ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అర్థమవుతోంది.

ల్యాబ్ రిపోర్టుల్లో పక్కా క్లారిటీ.. నాణ్యతకు పెద్దపీట : కస్టమర్ల ఆరోగ్యం విషయంలో తాము రాజీ పడబోమని చెప్పిన నెస్లే.. ఆరోపణలు వచ్చిన వెంటనే అప్రమత్తమైంది. సదరు వైరల్ పోస్ట్‌లో కనిపిస్తున్న బ్యాచ్‌ నంబర్‌కు చెందిన రిఫరెన్స్ శాంపిళ్లతో పాటు, మార్కెట్లో విక్రయిస్తున్న ఇతర మ్యాగీ ప్యాకెట్లను ప్రతిష్ఠాత్మక ల్యాబ్‌లకు పంపించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) గుర్తింపు, ఎన్‌ఏబీఎల్ (NABL) అక్రిడిటేషన్ ఉన్న స్వతంత్ర ప్రయోగశాలల్లో కఠినమైన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలో మ్యాగీలో ఎలాంటి పురుగుల ఆనవాళ్లు  లేవని, వంద శాతం సురక్షితమని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని తేటతెల్లమైంది.

వినియోగదారుల విశ్వాసమే మా ఊపిరి : ఈ వ్యవహారంలో పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లు నెస్లే స్పష్టం చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాస్తవ నిర్ధారణ కోసం చేపట్టిన ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపింది. అవసరమైన అన్ని ఆధారాలు, ల్యాబ్ రిపోర్టులు, క్వాలిటీ రికార్డులు, మార్కెట్ నమూనాల విశ్లేషణ ఫలితాలను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు వెల్లడించింది. “వినియోగదారుల నమ్మకమే మాకు అత్యంత ప్రాధాన్యం. ఆహార భద్రతలో అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలు ఎప్పటికైనా నిజానిజాలను బయటపెడతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం” అని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News