రైలు ప్రయాణీకులకు బిగ్ అప్‌డేట్. ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఇకపై టికెట్ బుకింగ్ తేదీలు మార్చుకోవచ్చు. రిజర్వేషన్ లభ్యత మరింత సులభతరం కానుంది. కొత్తగా ఏయే రూల్స్ మారాయో తెలుసుకుందాం..
ప్రయాణీకుల సౌకర్యం, వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుుడు సరికొత్త మార్పులు చేస్తోంది. టికెట్ బుకింగ్, రిజర్వేషన్ విషయంలో పారదర్శకత కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ మార్పులు గమనించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ నేపధ్యంలో టికెట్ లభ్యత అవకాశాలు మరింత పెరగనున్నాయి. టికెట్ల జారీలో పారదర్శకత ఉంటుంది. ఇందులో భాగంగానే జూలై 15 నుంచి ఆధార్ అథెంటిఫికేషన్, ఓటీపీ వెరిఫికేషన్ అమల్లోకి వచ్చాయి. తద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఏజెంట్లకు కాకుండా సామాన్య ప్రయాణీకులకు ప్రాధాన్యత లభించనుంది. ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేస్తేనే టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. తత్కాల్ బుకింగ్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ రూల్ తీసుకొచ్చింది.
మరోవైపు రిజర్వేషన్ ఛార్ట్ ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు సిద్ధమయ్యేది. ఇప్పుడీ సమయాన్ని రెట్టింపు చేసింది ఐఆర్సీటీసీ. అంటే 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధమైపోతుంది. ఫలితంగా టికెట్ లభించని ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా మరుసటి రోజు మద్యాహ్నం 2 గంటల్లోపు బయలుదేరే రైళ్ల టికెట్ వివరాలను ముందు రోజు రాత్రి 9 గంటలకు, 2 గంటల తరువాత బయలుదేరే రైళ్ల టికెట్ వివరాలను ఉదయం 8 గంటలకు ప్రయాణీకులు మొబైల్స్‌కు మెస్సేజ్ ద్వారా అందిస్తోంది.
ఇక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువు గతంలో 120 రోజులుండేది. ఇప్పుడు ఆ గడువును సగానికి తగ్గించి 60 రోజులకు పరిమితం చేశారు. అక్టోబర్ 1 నుంచి బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఆధార్ వెరిఫైడ్ కస్టమర్లకే అవకాశం ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా బుక్ చేసుకున్న టికెట్లలో ప్రయాణ తేదీని మార్చుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్ విధానంలోనే సులభంగా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు జనవరి 2026 నుంచి అమల్లోకి రానుంది.


