CJP Cybercrime alert: కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆఫర్లు, గిఫ్టులు, ప్రభుత్వ పథకాలు, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో లింక్‌లు పంపించి.. వాటి ద్వారా ఎదుటి వారి సమాచారం మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఇంకేముంది ఆ వెంటనే చూస్తే బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది. తాజాగా సైబర్ నేరగాళ్లు మరో కొత్తదారిని ఎంచుకున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/new-express-train-between-cherlapalli-tirupati/
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పేరును సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. CJP పేరుతో సభ్యత్వం అంటూ ప్రజలకు వాట్సాప్‌లో నకిలీ లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేసిన వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో ఇలాంటివి జరగడంతో అక్కడి పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఆ లింక్స్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని.. పర్సనల్ డేటా నేరగాళ్లకు చేరుతుందని హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్ల ప్లాన్ ఇదే..
‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఆన్‌లైన్ సర్వేలు, ఓటింగ్ లేదా ఉచిత బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్‌లను పంపిస్తారు. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్‌లోని సున్నితమైన సమాచారం (బ్యాంకు పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, పర్సనల్ డేటా) మొత్తం నేరగాళ్ల సర్వర్‌కు చేరిపోతుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మీ అకౌంట్ నుంచి క్షణాల్లో డబ్బులు కాజేస్తారు.
వీటిని క్లిక్ చేయకండి..
వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దనని సైబర్ సెక్యూరిటీ అధికారులు సూచించారు. తెలియని వ్యక్తులు పంపిన APK ఫైల్స్ లేదా థర్డ్-పార్టీ యాప్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దన్నారు. ఓటీపీ, పిన్ నంబర్, లేదా ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని స్పష్టం చేశారు. మీరు పొరపాటున అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.

