Newborn Hand Cut Off During Delivery: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఆ తల్లికి పుట్టెడు దుఃఖం మిగిలింది. బిడ్డ ఏడుపు వినగానే ఆనందంతో పొంగిపోవాల్సిన ఆ కుటుంబం, కంటికి రెప్పలా కాపాడాల్సిన వైద్యుల నిర్లక్ష్యానికి కన్నీరుమున్నీరవుతోంది. ప్రసవం సమయంలో అప్పుడే పుట్టిన పసికందు చేయి తెగిపడటం హరియాణాలో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి ఘోరం ఎలా జరిగింది.. ? చిన్న బ్లేడు తగిలితే చేయి తెగిపోతుందా..? ఈ దారుణంపై అధికారులు ఏమంటున్నారు?
వైద్యం వికటించి.. పసికందుకు శాపం!
హరియాణాలోని నుహ్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి, కాన్పు సమయంలో వైద్యులు నవజాత శిశువు కుడి చేతిని శరీరం నుంచి వేరు చేసిన అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఈ అమానవీయ ఘటన మాండిఖేడాలోని అల్ అఫియా సివిల్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.
బాధితుల కథనం ప్రకారం…
ఆసుపత్రిలో చేరిక: సర్జినా అనే మహిళను ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు జులై 30వ తేదీ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు మాండిఖేడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
వైద్యుల మాట: దాదాపు మూడు గంటల తర్వాత ప్రసవం జరిగిందని, మగబిడ్డ పుట్టాడని వైద్యులు తెలిపారు. అయితే, ప్రమాదవశాత్తూ ఓ చిన్న బ్లేడు శిశువు చేతికి తగిలిందని చెప్పారు.
బయటపడ్డ నిజం: బ్లేడు తగిలిందని చెప్పడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వార్డులోకి వెళ్లి చూడగా వారికి దిమ్మతిరిగే వాస్తవం తెలిసింది. శిశువు కుడి చేయి పూర్తిగా తెగి, శరీరం నుంచి వేరుపడి ఉంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/tejaswi-yadav-sensational-comments-on-bihar-voters-list/
ప్రశ్నిస్తే బెదిరింపులు: “చిన్న బ్లేడు తగిలితే చేయి మొత్తం ఎలా తెగిపోతుంది?” అని వైద్యులను నిలదీయగా, వారు తమపై దురుసుగా ప్రవర్తించి, ఆసుపత్రి నుంచి బయటకు గెంటేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గందరగోళం.. పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద గందరగోళం సృష్టించారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘డయల్ 112’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డకు ఈ గతి పట్టిందని, నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు.
ఈ విషయంపై స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ సర్వ్‌జిత్ థాపర్, ఘటనపై తనకు సమాచారం అందిందని, వెంటనే విచారణ జరపాలని సంబంధిత ఎస్ఎంఓను ఆదేశించినట్లు తెలిపారు. విచారణ అనంతరం వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


