Saturday, November 15, 2025
HomeTop StoriesGurpatwant Singh Pannun: ప్రధాని మోదీని బెదిరించిన ఖలిస్థానీ ఉగ్రవాది.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ

Gurpatwant Singh Pannun: ప్రధాని మోదీని బెదిరించిన ఖలిస్థానీ ఉగ్రవాది.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ

NIA Investigation on Gurpatwant Singh Pannun: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‍పత్వంత్ సింగ్ పన్నూన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పన్నూన్‌తో పాటు, అతను నడుపుతున్న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సంస్థను కూడా ఈ కేసులో చేర్చారు. కాగా, ఆగస్టు 10న పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పన్నూన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర స్థాయిలో విషం కక్కాడు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుకొని ఖలిస్థాన్ ఏర్పాటు చేస్తామంటూ ఓ మ్యాప్‌ను కూడా విడుదల చేశాడు. అతని ప్రసంగం భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా, సిక్కులలో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టేలా ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పన్నూన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 61(2) (క్రిమినల్ కుట్ర), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ నేరం తీవ్రత, దాని వెనుక ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు, బృహత్తర కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నందున ఎన్ఐఏ దర్యాప్తు తప్పనిసరి అని హోం శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా, భారత్‌పై పోరాడేందుకు ఓ ‘అమరవీరుల బృందాన్ని’ ఏర్పాటు చేసినట్లు సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ ప్రకటించిందని కూడా ఎఫ్ఐఆర్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది.

- Advertisement -

అమెరికాలో ఉంటూ భారత్‌పై విషం కక్కుతున్న పన్నూ..

అమెరికాలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పన్నున్ చేస్తున్న ఈ కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి సిక్కు సైనికులను లక్ష్యంగా చేసుకుని చేసిన అతని పిలుపు దేశ రక్షణ దళాలలో అల్లర్లు సృష్టించే ప్రయత్నమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ.. విదేశాల నుంచి భారత సార్వభౌమత్వానికి సవాల్ విసురుతున్న పన్నున్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక దేశద్రోహ చర్యగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశించిన కుట్రగా కూడా పరిగణిస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి వివరాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad