Delhi bomb blast investigation: దిల్లీ బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. ఫరీదాబాద్‌లో భారీఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు, దీనికి సంబంధం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ కేసు పూర్తి దర్యాప్తు బాధ్యతల్ని దిల్లీ పోలీసుల నుంచి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) తీసుకుంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడులో మృతుల సంఖ్య 12కి చేరింది. ఘటనా స్థలిలోనే 9 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. అయితే మృతుల్లో ఇప్పటివరకు కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించినట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ఉత్తర్‌ప్రదేశ్, మరొకరు దిల్లీకి చెందినవారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిగిలినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వారి వయసు 28-58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది దిల్లీవాసులుగా పోలీసులు గుర్తించారు.
హడావుడిగా బాంబును తరలిస్తున్నట్లుగా అనుమానం: దిల్లీ బాంబు పేలుడుకు కారణమైన వాహనాన్ని నడిపింది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉమర్‌కు ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండటంతో ఇక పోలీసులకు దొరికిపోక తప్పదనే భయంతోనే ఆత్మాహుతికి పాల్పడ్డట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ బాంబులును వేరొక చోటుకు తరలించే క్రమంలోఅనుకోకుండా పేలాయా అనే కోణంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం మరింత తీవ్రంగా ఉండేదని అన్నారు. బాంబును హడావుడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని పలువురు అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అధికారులు చెబుతున్నారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం: దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనపై దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ముమ్మరం దర్యాప్తును కొనసాగిస్తున్నాయని అన్నారు. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని మోదీ తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని అన్నారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/national-news/pm-modi-sensational-comments-on-delhi-bomb-blast/
పేలుడుకు కారకులైనవారిలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. భద్రతాబలగాల ప్రతాపమేంటో వారికి చూపిస్తామని అన్నారు. దిల్లీతోపాటు దేశవ్యాప్త పరిస్థితులపై ఆయన ఉన్నతస్థాయిలో రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. అంగోలా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడుపై దర్యాప్తు వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెడతామని అన్నారు.


