Nirav Modi extradition to India : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చివరి అంకానికి చేరుకున్నాయి. సుదీర్ఘకాలంగా బ్రిటన్‌లో భారత ఇన్వెస్టిగేషన్ సంస్థలు చేస్తున్న న్యాయపోరాటం ఫలించి, నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయని జాతీయ మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. ఈ ప్రక్రియలో తాజాగా చోటుచేసుకున్న కీలక పరిణామాలేంటి…? నీరవ్ మోదీని వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం వేసిన ఎత్తుగడలేంటి…?
అసలేం జరిగిందంటే : పంజాబ్ నేషనల్ బ్యాంకును (PNB) సుమారు రూ.6,498 కోట్లకు మోసం చేశాడనే ఆరోపణలతో నీరవ్ మోదీ 2018లో దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న అతడిని, 2019లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడిని భారత్‌కు అప్పగించేందుకు CBI, ED వంటి సంస్థలు న్యాయపోరాటం చేస్తున్నాయి.
భారత్ కీలక హామీ.. బ్రిటన్ సానుకూలత : ఈ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించిన తర్వాత, అతడిపై కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ అభియోగాలపై మాత్రమే విచారణ జరుపుతామని, ఇతర కేసులేవీ పెట్టమని భారత ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వానికి సార్వభౌమ పూచీకత్తుతో కూడిన లేఖను అందించింది.
సంయుక్త హామీ: సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖలు సంయుక్తంగా ఈ హామీ ఇచ్చాయి.
ప్రత్యేక సెల్: నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో, యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక సౌకర్యాలున్న ‘బ్యారక్ నంబర్ 12’లో ఉంచుతామని, అందుకు సంబంధించిన వీడియోలను కూడా బ్రిటన్ కోర్టుకు సమర్పించాయి.
నీరవ్ చివరి ప్రయత్నం.. నవంబర్ 23న తుది తీర్పు : భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌లోని దిగువ కోర్టుల నుంచి హైకోర్టు వరకు అన్నీ తీర్పులిచ్చిన నేపథ్యంలో, నీరవ్ మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. “భారత్‌కు వెళ్తే నన్ను వేధిస్తారు, నా ప్రాణాలకు హాని ఉంది” అంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై నవంబర్ 23న తుది విచారణ జరగనుంది.
భారత ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీల నేపథ్యంలో, కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని దర్యాప్తు సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఆ రోజు కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే, ఏళ్ల తరబడి చట్టం కళ్లుగప్పి తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని భారత్‌కు తీసుకువచ్చి, న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.


