Saturday, November 15, 2025
Homeనేషనల్Ethanol-Blended Petrol: భవిష్యత్ ఇంధనం బయో-ఇథనాల్: నితిన్ గడ్కరీ

Ethanol-Blended Petrol: భవిష్యత్ ఇంధనం బయో-ఇథనాల్: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Doubles Down on Ethanol-Blended Petrol: దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను తప్పనిసరిగా కలపడంపై (E20) ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో దేశంలో వినియోగించే ఇంధనం 100 శాతం బయో-ఇథనాల్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న గడ్కరీ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడమే ఈ ఇథనాల్ మిశ్రమ పెట్రోలియం (EBP) కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇథనాల్‌ వాడకం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత అత్యధిక వాహనాలు ఉన్న దేశం భారతేనని, కాబట్టి కాలుష్య నియంత్రణ అత్యవసరమని ఆయన వివరించారు.

ప్రజల నుంచి వ్యతిరేకత..

అయితే, ఈ E20 విధానంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా పాత వాహనాల ఇంజిన్‌లకు ఈ ఇంధనం హాని చేస్తుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కారు యజమాని అయితే, దీన్ని ‘బహిరంగ మోసం’గా అభివర్ణించారు. ఈ ఇంధనం వల్ల తన వాహనానికి ఏదైనా నష్టం జరిగితే, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. స్వచ్ఛమైన పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విడిగా అమ్మాలని, ఏది వాడాలనేది వినియోగదారుడికి వదిలేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శాస్త్రీయ ఆధారాలు లేని భయాలు?

ఈ ఆందోళనలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఈ భయాలు శాస్త్రీయ ఆధారాలు లేనివని కొట్టిపారేసింది. ఇథనాల్‌ మిశ్రమం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గుతుందని అంగీకరించినప్పటికీ, అది ఆమోదయోగ్యమైన పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పథకం వల్ల విదేశీ మారకం ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని, అంతేకాకుండా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad