Nitish Kumar Bihar elections : “నా రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశాను, నా కుటుంబం కోసం ఏమీ చేయలేదు.” – ఇవి బిహార్ ఎన్నికల సమరశంఖం పూరించిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మదిలోంచి వచ్చిన మాటలు. ఎన్నికల నగారా మోగిన వేళ, ఆయన విడుదల చేసిన ఒక వీడియో సందేశం ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన సుదీర్ఘ పాలనను వివరిస్తూ, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, మరోసారి అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఇంతకీ ఆ వీడియోలో నీతీశ్ ఇంకా ఏం చెప్పారు? తన పాలనపై ఆయనకున్న ధీమా ఏంటి? ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు?
గర్వకారణంగా ‘బిహారీ’ : గతంలో బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని, ‘బిహారీ’ అని చెప్పుకోవడానికి కూడా ప్రజలు అవమానంగా భావించేవారని నీతీశ్ కుమార్ గుర్తుచేశారు. 2005లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొట్టమొదట శాంతిభద్రతల సమస్యపైనే దృష్టి సారించి, రాష్ట్రంలో సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పానని తెలిపారు. ఇప్పుడు ‘బిహారీ’ అనే పదం ఒక గౌరవంగా మారిందని ఆయన సగర్వంగా ప్రకటించారు.
అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలపై విమర్శల జోరు : శాంతిభద్రతలతో పాటు విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించామని నీతీశ్ వివరించారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఆ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం చేసిందేమీ లేదు. కానీ, మా ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించి, వారిని స్వతంత్రులుగా తీర్చిదిద్దింది,” అని ఆయన విమర్శించారు.
డబుల్ ఇంజిన్‌తోనే అభివృద్ధి : బిహార్ అభివృద్ధి కేవలం ఎన్డీయేతోనే సాధ్యమని నీతీశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటం వల్లే దేశం, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, ఈ “డబుల్ ఇంజిన్” పాలన కొనసాగాలంటే ప్రజలు తమకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో నీతీశ్ కుమార్ విడుదల చేసిన ఈ భావోద్వేగ సందేశం, ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.


