త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి అధికారం చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి.. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar)కు ఓ ఆఫర్ ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. నీతీశ్ కుమార్‌కు తమ కూటమి తలుపులు తెరిచే ఉన్నాయని అయితే ఆయన కూడా తన గేట్లు తెరవాలన్నారు. అప్పుడే రెండు వైపుల నుంచి రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. లాలూ వ్యాఖ్యలపై నీతీశ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ రెండు చేతులు జోడించి దండం పెట్టారు.
కాగా గతేడాది బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. పట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే కూటమి కన్వీనర్ పదవి విషయంలో అసంతృప్తికి గురైన ఆయన తిరిగి ఎన్డీఏలో చేరారు. నితీశ్ ఎన్డీఏలో చేరడంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడం సులభం అయింది.