Thursday, March 5, 2026
HomeTop StoriesHoli: హోలీ రోజు ఆ ఊరిలో మగవారికి నో ఎంట్రీ.. కనిపిస్తే కొరడా దెబ్బలే!

Holi: హోలీ రోజు ఆ ఊరిలో మగవారికి నో ఎంట్రీ.. కనిపిస్తే కొరడా దెబ్బలే!

Nagar village: హోలీ పండగ అంటేనే రంగుల పండగ. కులమత, లింగ భేదం లేకుండా అందరూ కలిసి జరుపుకొనే వేడుక. కానీ రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో మాత్రం హోలీ రోజున ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తుంది. హోలీ రోజు ఆ గ్రామంలోకి మగవారికి నో ఎంట్రీ. గత ఐదు శతాబ్దాలుగా అక్కడ కేవలం మహిళలు మాత్రమే హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఆ గ్రామంలో కొనసాగుతున్న ఈ వింత ఆచారం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం!

- Advertisement -

పురుషులు ఊరు విడిచి వెళ్లాల్సిందే!: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా నగర్ గ్రామంలో ఈ వింత సంప్రదాయం కొనసాగుతోంది. హోలీ రోజున పిల్లల నుండి వృద్ధుల వరకు మగవారందరూ గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిందే. వీరంతా ఉదయం 10 గంటలకే ఊరి శివార్లలోని చాముండీ మాత ఆలయానికి చేరుకుని జాతరలో పాల్గొంటారు. పొరబాటున ఎవరైనా పురుషుడు ఊరిలో ఉండి వేడుకలను చూడాలని ప్రయత్నిస్తే.. గతంలో కొరడా దెబ్బల శిక్ష ఉండేది. నేటికీ ఆ నిబంధనను అతిక్రమిస్తే ఊరి నుంచి బహిష్కరించే పరిస్థితి ఉంది.

ఆ ఒక్కరోజూ మహిళలదే రాజ్యం: ఈ ఆచారం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పాతకాలంలో ఉన్న పరదా పద్ధతి వల్ల మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి పండుగ జరుపుకోలేకపోయేవారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్కరోజైనా ఆడవాళ్లు తమకు నచ్చినట్లు ఉండాలని ఈ నిబంధనలు పెట్టారు. మహిళలు ఈ ఒక్కరోజైనా పూర్తి స్వేచ్ఛతో ఆనందించాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లుగా అక్కడి స్థానిక పెద్దలు తెలిపారు. ఈ రోజున మహిళలు పురుషుల దుస్తులు ధరించి మరీ నృత్యాలు చేస్తారు. ఎవరి అభ్యంతరాలు లేకుండా కేవలం తమ స్నేహితురాళ్లతో కలిసి రంగులు పూసుకుంటూ కేరింతలు కొడతారు.

Also read-Happy Holi: హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కనిపిస్తే కొరడా దెబ్బలే: హోలీ మరుసటి రోజున మాత్రం స్త్రీ, పురుషులు కలిసి రంగులు చల్లుకుంటారు. అయితే ఈ వేడుక ముగిసే సమయంలో మహిళలు పురుషులను సరదాగా కొరడాలతో కొట్టడం ఇక్కడి ప్రత్యేకత. కాలం మారుతున్నా పాతకాలపు ఆచారాలను గౌరవిస్తూనే.. మహిళల స్వేచ్ఛకు పట్టం కడుతున్న నగర్ గ్రామ హోలీ ఆచారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News