NTA affidavit in Supreme Court: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు లేకుండా నీట్‌తో సహా ఎన్‌టీఏ పర్యవేక్షణలో జరిగే అన్ని పరీక్షలను పారదర్శకతతో నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది. నీట్ పరీక్షకు ముందు (ఏప్రిల్ 17)న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం గురించి ఎన్‌టీఏ తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఆ సమావేశంలో వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పరీక్షకు ముందు.. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి కమిటీ పలు సూచనలు చేసినట్లు తెలిపింది. వాటిల్లో కొన్ని సూచనలను ఇప్పటికే అమలు చేసినట్లు వెల్లడించింది.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు..
పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ (ఎస్‌ఎల్‌సీసీ)లు, జిల్లా స్థాయి సమన్వయ కమిటీ (డీఎల్‌సీసీ)లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. నీట్ పరీక్ష నిర్వహించే సమయానికి 18 ఎస్‌ఎల్‌సీసీలు, 621 డీఎల్‌సీసీలు పనులు ప్రారంభించాయని, పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ తరహా ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు కేంద్ర విద్యాశాఖతో కలిసి పని చేస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా, ఈ ఏడాది మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకవ్వడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేక మంది అరెస్టయ్యారు.

