NEET ReExam నీట్- యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21 నాడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక X హ్యాండిల్ ద్వారా వివరాలు వెల్లడించింది. నీట్ పరీక్షలపై అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది మే 3న జరిగిన నీట్- యూజీ పరీక్ష పేపర్ లీక్ కావడం, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్రం పరీక్షను రద్దు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా కొత్త తేదీని NTA ఖరారు చేసింది.
కాగా, నీట్ పునఃపరీక్షకు అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా NTA పేర్కొంది. పాత రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుతాయని తెలిపింది. పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు అభ్యర్థులందరికీ కొత్త హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకుండా, కేవలం NTA అధికారిక వెబ్‌సైట్ వివరాలను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

