చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు అన్ని రంగాలలో బాగా వెనుకబడిపోయారని, వీరికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించే విధంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టి అమోదింపజేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు ఎంపీ వద్దిరాజు తన సహచర ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ ఏర్పాటు జరిగిన తొట్టతొలిత అసెంబ్లీ సమావేశాలలోనే మహానేత కేసీఆర్ నేతృత్వంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ బిల్లు ప్రవేశపెడుతూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.