ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు(Obulapuram Mining Case)లో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్, ఓఎంసీ కంపెనీని దోషులుగా తేలుస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేయడంతో పాటు లక్ష రూపాయల చెప్పున జరిమానా విధించింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఐపీఎస్ కృపానందని నిర్దోషిగా తేల్చింది.
కాగా ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇనుప గనులను ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమంగా తవ్విందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఇనుప గనుల లీజులను ఓఎంసీకి అక్రమంగా కేటాయించారని తేల్చారు. దీంతో ఉమ్మడది ఏపీ ప్రభుత్వానికి రూ.884.13 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విచారణలో వెల్లడైంది. ఐఏఎస్ యర్రా శ్రీలక్ష్మి, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అధికార దుర్వినియోగం చేసి, ఓఎంసీకి లీజులు మంజూరు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది.
ఈమేరకు సీబీఐ అధికారులు 2011లో ఫస్ట్ చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో A1గా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి , A2గా గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)ని చేర్చారు. ఇక మైనింగ్ డైరెక్టర్ వాల్మికి రాజగోపాల్, ఐపీఎస్ కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కేసు నమోదు చేసింది. 14 ఏళ్ల విచారణ అనంతరం ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.