Saturday, November 15, 2025
Homeనేషనల్Odisha Student Death: అమ్మాయిల రక్షణపై భగ్గుమన్న ఒడిశా... ప్రొఫెసర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య!

Odisha Student Death: అమ్మాయిల రక్షణపై భగ్గుమన్న ఒడిశా… ప్రొఫెసర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య!

Odisha Student Suicide Outcry : ఒడిశాలో ఒక విద్యార్థిని లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రతిపక్షాలు “వ్యవస్థీకృత హత్య”గా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడటంతో, ఒడిశా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో అసలేం జరిగింది? నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాజకీయ నాయకుల వాదనలేంటి? 

ఒడిశా విద్యార్థిని ఆత్మహత్య: బాలేశ్వర్​లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలలో బి.ఎడ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని జూలై 12న కళాశాల ప్రాంగణంలోనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రొఫెసర్‌ సమీర్‌ కుమార్‌ సాహు తనను లైంగికంగా వేధించాడని, దీనిపై కళాశాల ఫిర్యాదుల కమిటీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు ప్రాణాలతో పోరాడి, 95శాతం కాలిన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతూ జూలై 14న AIIMS భువనేశ్వర్‌లో మృతిచెందింది. ఆమెకు మూత్రపిండాల మార్పిడి కూడా చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఆమెను రక్షించబోయిన మరో యువతికి కూడా 65శాతం గాయాలవ్వగా, ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ప్రొఫెసర్‌ సమీర్‌ కుమార్‌ సాహుతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను అరెస్టు చేశారు.

ప్రతిపక్షాల దాడి: “వ్యవస్థీకృత హత్య” : విద్యార్థిని మృతిపై ఒడిశాలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దీనిని కేవలం ఆత్మహత్యగా కాకుండా, ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం వల్ల జరిగిన “వ్యవస్థీకృత హత్య”గా అభివర్ణించాయి.

నవీన్ పట్నాయక్, మాజీ ముఖ్యమంత్రి: మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం వల్ల ఒక ప్రాణం పోయిందని తలుచుకుని ఆవేదన చెందుతున్నాం. ఇది అత్యంత బాధాకరమైన విషయం. వాస్తవానికి ఇది ప్రమాదం కాదు. ఆమెకు సాయం చేయకుండా సైలెంట్​గా ఉన్న వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగింది. కళాశాల అధికారులు పట్టించుకోకపోయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. న్యాయం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని న్యాయం చేయాలని అడిగింది. బాలేశ్వర్ ఎంపీని స్వయంగా కలిసింది. ఎవరైనా ఒకరు తన బాధ్యత తీసుకుని ఉంటే ఆ విద్యార్థిని ప్రాణాలతో అవకాశం ఉండేదన్నారు. వ్యవస్థాగత ద్రోహం, ప్రణాళికాబద్ధమైన అన్యాయంగా ఆయన ఈ ఘటనను అభివర్ణించారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఇది “ఆత్మహత్య కాదని, వ్యవస్థీకృత హత్య” అని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “న్యాయం కోరుతూ బాధిత విద్యార్థిని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందుకు, ఆమెకు న్యాయం చేయడానికి బదులుగా బెదిరించి, హింసించారు. పదేపదే అవమానించారు. ఎప్పటిలాగే బీజేపీ వ్యవస్థ నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకునేలా చేసింది. ఇది ఆత్మహత్య కాదు వ్యవస్థీకృత హత్య. మోదీజీ ఒడిశా లేదా మణిపుర్‌లో అయినా దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా? దేశానికి మీ మౌనం అవసరం లేదు. వీటన్నింటికీ సమాధానాలు కావాలి. భారతదేశ మహిళలకు భద్రత, న్యాయం కావాలి” అని రాహుల్ గాంధీ X వేదికగా ట్వీట్ చేశారు.

బీజేపీ కౌంటర్: “చీప్ పాలిటిక్స్” :  ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ “చీప్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆరోపించారు. “సున్నితమైన అంశాలను కూడా రాజకీయాలు చేస్తున్నారని” విమర్శించారు. మహిళల భద్రతకు, న్యాయానికి బీజేపీ కృషి చేస్తుందని, కానీ కాంగ్రెస్​ మాత్రం ప్రతి ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుంటుందని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు.

నిరసనలు, తదుపరి చర్యలు : యువతి మరణంతో బాలేశ్వర్​లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో సీసీటీవీ నిఘా, అంతర్గత విచారణ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (NCW), NHRC కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించాయి.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad