Sunday, November 16, 2025
Homeనేషనల్NEET Odisha : కొండకోనల్లో విజ్ఞానపు వెలుగు - నీట్​లో గెలిచిన తొలి దిదాయి బిడ్డ!

NEET Odisha : కొండకోనల్లో విజ్ఞానపు వెలుగు – నీట్​లో గెలిచిన తొలి దిదాయి బిడ్డ!

Didayi tribal girl’s NEET success story : కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు… మహాపురుషులవుతారు అన్నారు పెద్దలు. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఒడిశాలోని ఓ గిరిజన యువతి. కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలో, కొండకోనల మధ్య బతుకీడుస్తున్న ఓ మారుమూల గిరిజన తెగ నుంచి ఆణిముత్యంలా పైకొచ్చింది. సామాజిక, ఆర్థిక సంకెళ్లను తెంచుకుని, వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో విజయకేతనం ఎగురవేసింది. తన తెగలోనే ఈ ఘనత సాధించిన తొలి బాలికగా చరిత్ర సృష్టించింది. అసలు ఎవరామె…? ఆమె ఈ శిఖరాన్ని ఎలా అధిరోహించింది..? అపారమైన ఆత్మవిశ్వాసంతో ఆమె సాధించిన ఆ అద్భుత విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

- Advertisement -

అడ్డంకులను ఎదిరించి.. ఆశయానికి అడుగుదూరంలో : ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా, అమ్లిగూడ అనే మారుమూల గ్రామం ఆమెది. కనీసం రోడ్డు, వైద్య సదుపాయాలు కూడా లేని ఆ పల్లెలో ‘దిదాయి’ అనే గిరిజన తెగకు చెందిన చంపా రస్పెద అనే యువతి తన కలను సాకారం చేసుకుంది. పేదరికం, ప్రతికూల పరిస్థితులు వెక్కిరించినా, మొక్కవోని పట్టుదలతో చదివి, తొలి ప్రయత్నంలోనే నీట్ పరీక్షలో అర్హత సాధించింది. భవిష్యత్తులో డాక్టర్‌ అయి, తన కమ్యూనిటీ ప్రజలకు సేవ చేయాలన్నదే ఆమె లక్ష్యం. తన తెగ నుంచి నీట్ గెలిచిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించడంతో ఆమె గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

కష్టాల కడలిని దాటిన చదువుల పడవ: చంపా విద్యాభ్యాసం పూలపాన్పు కాదు. ఐదేళ్ల వయసు నుంచే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంది. ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్లాలంటే ఏకంగా 20 కిలోమీటర్లు కొండలు ఎక్కిదిగాల్సి వచ్చేది. ఏడో తరగతి తర్వాత, పడవలో 60 కిలోమీటర్లు ప్రయాణించి చిత్రకొండలోని హాస్టల్‌లో చేరి పదో తరగతి పూర్తిచేసింది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తండ్రి పోడు వ్యవసాయం మీద వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. అయినా కూతురి చదువుకు ఏనాడూ అడ్డు చెప్పలేదు.

గురువు దొరికిన వేళ : ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరాలనుకున్న చంపా జీవితాన్ని ఆమె హైస్కూల్ టీచర్ ఉత్కల్ కేసరి దాస్ కీలక మలుపు తిప్పారు. ఆమెలోని ప్రతిభను గుర్తించి, మెడిసిన్ చదవమని ప్రోత్సహించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాను అంత పెద్ద చదువులు చదవలేనని చంపా చెప్పగా, ఆ గురువే ఆమెకు అండగా నిలిచారు. చదువుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చి, బాలేశ్వర్​లోని తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి నీట్​కు కోచింగ్ ఇప్పించారు. కేవలం 5 నెలల శిక్షణతోనే చంపా తన గురువు నమ్మకాన్ని నిలబెట్టి, తొలి ప్రయత్నంలోనే నీట్‌లో విజయం సాధించింది.

చదువే మాకు వెలుగు: చంపా : ఈ విజయంపై చంపా ఆనందం వ్యక్తం చేసింది. “నా విజయం వెనుక నా గురువు ఉత్కల్ కేసరి దాస్ గారి చేయూత ఎంతో ఉంది. మా దిదాయి తెగ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. మా గ్రామంలో ఆసుపత్రి లేదు, చిన్న రోగాలొచ్చినా మూఢనమ్మకాలతో బతుకుతున్నారు. నేను డాక్టర్‌నై వారికి వైద్యం అందిస్తాను. విద్యతోనే మా ప్రజలు అభివృద్ధి చెందుతారు. వారికి చదువు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను,” అని ఆమె ధీమాగా చెప్పింది. చంపా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఊరి పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పేదని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు. ఈ అరుదైన విజయం సాధించిన చంపాను జిల్లా మేజిస్ట్రేట్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad