ప్రధాని మోదీని(PM Modi) జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ప్రశంసించారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న మోదీ..రూ.2,700కోట్లతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్ ప్రాంతంలో నిర్మించిన మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. మోదీతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా సీఎం ఒమర్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే జమ్మూలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని.. అప్పుడే కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితంగానే ప్రస్తుతం తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని పేర్కొన్నారు.
అలాగే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తారని నమ్ముతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతిభద్రతలు కొలిక్కి వచ్చాయని ఒమర్ తెలిపారు. జడ్-మోడ్ సొరంగం ప్రారంభంతో ఎగువ ప్రాంతాల ప్రజలు ఇకపై మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.