Truck Rams Over 25 Vehicles On Mumbai-Pune Expressway: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి దాదాపు 25 వాహనాలకు పైగా ఢీకొట్టింది. దీంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగింది?
ఖోపోలి ఎగ్జిట్ సమీపంలో, టోల్ బూత్ దాటిన తర్వాత ముంబై వైపు వెళ్లే మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముంబై వైపుగా దూసుకుపోతున్న ఒక భారీ ట్రక్కుకు బ్రేకులు పనిచేయక పోవడంతో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు వేగంగా ముందు వెళ్తున్న అనేక వాహనాలను ఢీకొట్టింది. వాటిలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఈ ధాటికి సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ పోయాయి.
Massive collision on the Mumbai-Pune Expressway has left one woman dead and 21 others injured after a trailer with brake failure rammed into over 25 vehicles.
The incident occurred on the Mumbai-bound lane, prompting immediate rescue efforts.
Authorities are on the scene,… pic.twitter.com/OIKpGExDj8
— Jayprrakash Singh (@jayprakashindia) July 26, 2025
ఈ ప్రమాదంలో ఒస్మానాబాద్‌కు చెందిన అనితా ఎఖండే (35) అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన 21 మందికి ఖోపోలి మున్సిపల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం కమోఠేలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద బాధితుల్లో బాంబే హైకోర్టు న్యాయమూర్తి భార్య కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు, ఇండియా రిజర్వ్ బెటాలియన్, దేవదూత్, హైవే పోలీసులు, హెల్ప్ ఫౌండేషన్ వాలంటీర్లు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న వాహనాలను వేగంగా పక్కకు తొలగించి, 45 నిమిషాల్లోనే ఎక్స్‌ప్రెస్‌వేను క్లియర్ చేశారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, మద్యం సేవించలేదని నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోంది.


