దేశంలో జమిలి ఎన్నికల(Jamili Elections) నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 16న అనగా సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్(Arjun Ram Meghwal)ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభ బిజినెస్ లిస్ట్‌లో జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)ను చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) పరిశీలనకు వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును పంపనున్నారు.
కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి కానుంది. దీంతో ఈ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే 2029 కంటే ముందే జమిలి ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదంటే అపాయింటెండ్ డే 2029లో జరుపుతారా..? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.