Sunday, November 16, 2025
Homeనేషనల్Dalit rights : 70 ఏళ్ల వృద్ధురాలి విజయం.. 55 ఏళ్ల దాహానికి చరమగీతం!

Dalit rights : 70 ఏళ్ల వృద్ధురాలి విజయం.. 55 ఏళ్ల దాహానికి చరమగీతం!

Caste discrimination water access : రాళ్లు రువ్వినా వెరవలేదు.. దూషణలకు తలవంచలేదు. 70 ఏళ్ల వయసులో, 55 ఏళ్ల కన్నీటి కష్టానికి ముగింపు పలకాలనుకుంది. ఒకే ఒక్క గుక్కెడు నీళ్ల కోసం, దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కుల వివక్షపై ఆమె చేసిన న్యాయపోరాటం ఎలాంటిది..? కోర్టులో ఆమె చెప్పిన ఒక్క మాట, అధికారులను ఎలా పరుగులు పెట్టించింది..? ఒకే ఒక్క రోజులో ఆ గ్రామం రూపురేఖలు ఎలా మారిపోయాయి..? తమిళనాడుకు చెందిన మునియమ్మల్ అనే ఆ వృద్ధురాలి స్ఫూర్తిదాయక కథనం మీకోసం.

- Advertisement -

తమిళనాడులోని తెన్కాసి జిల్లా, తలైవన్ కోట్టై గ్రామం. అక్కడ నివసించే 70 ఏళ్ల దళిత వృద్ధురాలు మునియమ్మల్. ఆ గ్రామంలో సుమారు 3,000 కుటుంబాలు ఉండగా, అందులో 12% షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే. విచిత్రమేంటంటే, గ్రామం ఏర్పడినప్పటి నుంచి, అంటే సుమారు 55 ఏళ్లుగా, ఎస్సీలు నివసించే ప్రాంతానికి తాగునీటి పైపులైన్ సౌకర్యం లేదు.

అవమానాల నడుమ అర కిలోమీటరు నడక: తమ వీధిలో నీటి సౌకర్యం లేకపోవడంతో, దళిత కుటుంబాలు సుమారు 600 మీటర్ల దూరంలో ఉన్న ఇతర వర్గాల వారు నివసించే ప్రాంతానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ కూడా వారికి అవమానాలు తప్పలేదు. అగ్రవర్ణాల వారు దూషిస్తూ మాట్లాడటం, నీటి కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడం వారికి నిత్యకృత్యమైంది.

ఒక గొడవ.. కోర్టు మెట్లు: 2016లో, మునియమ్మల్ తన తోటలో పనిచేస్తుండగా, తిరుమలసామి అనే వ్యక్తి ఆమెతో గొడవపడి, కులం పేరుతో దూషించి రాళ్లు రువ్వాడు. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తెన్కాసి కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును నిందితుడు మధురై హైకోర్టులో సవాలు చేశాడు. ఇటీవలే ఆ కేసు విచారణకు వచ్చింది.

న్యాయమూర్తి ముందు కన్నీటి గాథ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుల, మునియమ్మల్‌ను ఆమె సమస్యల గురించి అడిగారు. అప్పుడు మునియమ్మల్, తనపై జరిగిన దాడి గురించే కాకుండా, గుక్కెడు నీళ్ల కోసం తమ జాతి పడుతున్న అవమానాల గురించి, 55 ఏళ్ల నిరీక్షణ గురించి కన్నీళ్లతో వివరించింది.

ఒకే ఒక్క రోజులో విజయం: మునియమ్మల్ ఆవేదనకు చలించిపోయిన న్యాయమూర్తి, తక్షణమే ఎస్సీలు నివసించే ప్రాంతానికి నీటి పైపులైన్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆశ్చర్యకరంగా, మునియమ్మల్ కోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చేలోపే, అధికారులు ఆ ప్రాంతంలో పైప్‌లైన్ వేసే పనులు ప్రారంభించారు.

మునియమ్మల్ మాటల్లో ఆనందం: “పోలీసులు వచ్చి కోర్టుకు పిలిస్తే, ఏంటోనని నా భర్తతో కలిసి వెళ్లాను. న్యాయమూర్తి మా కష్టాలు అడిగారు. మా నీటి సమస్య గురించి చెప్పాను. వెంటనే మాకు నీటి సరఫరాను ఆదేశించారు. మాకు చాలా సంతోషంగా ఉంది,” అని మునియమ్మల్ ఆనందం వ్యక్తం చేసింది.

గ్రామస్థుల ప్రశంసలు: “55 ఏళ్ల తర్వాత మా వీధికి నీళ్లొచ్చాయి. మునియమ్మల్ వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంది,” అని గ్రామస్థుడు కృష్ణమూర్తి అన్నారు. అయితే, పైపులైన్ వేశారని, ఇంకా నీటి సరఫరా ప్రారంభం కాలేదని, అధికారులు ఆ పని కూడా త్వరగా పూర్తి చేయాలని మరో గ్రామస్థుడు విజ్ఞప్తి చేశాడు.

అధికారులు ఏమన్నారంటే : కోర్టు ఆదేశాల మేరకు రూ. 5 లక్షల ఖర్చుతో 330 ఎస్సీ కుటుంబాల కోసం పైప్‌లైన్ వేశామని, ప్రతిరోజూ 30,000 లీటర్ల నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఒకే ఒక్క మహిళ సంకల్పం, 55 ఏళ్ల వివక్షకు, దాహార్తికి తెరదించింది. మునియమ్మల్ పోరాటం, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad