Online gaming bill: ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం తీవ్ర చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన “ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025” పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ చట్టం ఈ-స్పోర్ట్స్(e-sports), సాధారణ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. కానీ, వ్యసనం, ఆర్థిక నష్టాలు, భద్రతాపరమైన ముప్పులను దృష్టిలో ఉంచుకుని రియల్-మనీ గేమింగ్ (Real-money Gaming), ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధిస్తుంది.
ఉభయ సభల్లో ఆమోదం
మరోవైపు, ఈ బిల్లు లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఎన్నికల సంఘం ద్వారా బిహార్‌లోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు. ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించడంతో, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను అందించడం లేదా ప్రోత్సహించడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. కోటి జరిమానా లేదా రెండు శిక్షలు విధించవచ్చు. ఈ బిల్లు ఆన్‌లైన్ మనీ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలను నిషేధించడంతో పాటు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అటువంటి గేమ్‌ల కోసం నిధులను బదిలీ చేయకుండా అడ్డుకుంటుంది.
Read Also: ODI captain: వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్.. ?
అసలు ఈ బిల్లు ఎందుకంటే?
అసలు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు తెచ్చిందో అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. “ఆన్‌లైన్ మనీ గేమింగ్‌లో ప్రజలు తమ జీవితంలో చేసిన పొదుపు మొత్తాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ వల్ల కలిగే వ్యసనం, ఆర్థిక నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, అయితే ఈ- స్పోర్ట్స్, సోషల్ గేమింగ్‌ను మాత్రం ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు. చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి, ఉగ్రవాద సంస్థల మధ్య సందేశాల మార్పిడికి దుర్వినియోగమవుతున్నాయని ఆయన చెప్పారు. విదేశాల నుంచి పనిచేసే చాలా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు రాష్ట్రాల నిబంధనలను తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. పన్నులు ఎగవేస్తున్నారని, సరిహద్దు దాటి జరిగే కార్యకలాపాల వల్ల చట్ట అమలు అధికారులకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇకపోతే ఉభయసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తే ఇది చట్టంగా మారనుంది.
ఈ బిల్లు ప్రభావం ఏ యాప్‌లపై ఉంటుంది?
వెంచర్ క్యాపిటల్ సంస్థ లూమికై (Lumikai) ప్రకారం, 2029 నాటికి భారత ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ విలువ 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
- ఈ బిల్లు కారణంగా ముఖ్యంగా ప్రభావితమయ్యే కొన్ని యాప్‌లు:
- డ్రీమ్11 (Dream11): అగ్రశ్రేణి భారత క్రికెటర్ల ప్రచారం, ఇతర మార్కెటింగ్ ప్రయత్నాల వల్ల డ్రీమ్11 వంటి ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ యాప్ విలువ 8 బిలియన్ డాలర్లు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు కేవలం రూ. 8 చెల్లించి టీమ్‌లను రూపొందించవచ్చు.
- మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL): పిచ్‌బుక్ (PitchBook) డేటా ప్రకారం, దీని విలువ 5 బిలియన్ డాలర్లు.
- ఇతర యాప్‌లు: మై11 సర్కిల్ (My11Circle), హౌజాట్ (Howzat), ఎస్జీ11 ఫాంటసీ (SG11 Fantasy), విన్‌జో (WinZO), గేమ్స్24ఎక్స్7 (Games24x7), జంగ్లీ గేమ్స్ (Junglee Games), పోకర్‌బాజీ (PokerBaazi), గేమ్స్‌క్రాఫ్ట్ (GamesKraft), నజారా టెక్నాలజీస్ (Nazara Technologies)
Read Also: Reliance Jio: అవన్నీ పుకార్లే.. అందుబాటులోనే రూ.799 ప్లాన్


