Toll Plaza Digital Payments: ఏప్రిల్ 10 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఉండవు. టోల్ రుసుము చెల్లించాల్సిన ప్రతి వాహనం ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పండుగల సమయాలు, సెలవు రోజులు, ముఖ్యమైన సందర్భాల్లో టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణం వేగవంతం చేసేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే అది 100 శాతం పూర్తిగా లేదు. దీంతో పలు సందర్భాల్లో టోల్ ప్లాజాల వద్ద తీవ్రమైన క్యూ నెలకొంటోంది. ఈ రద్దీని నియంత్రించేందుకు కేంద్రం ఇప్పటికే 100 శాతం డిజిటల్ చెల్లింపుల దిశగా చర్యలు చేపట్టగా.. అది ఏప్రిల్ 10 నుంచి పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana/30-maoists-surrender-before-telangana-police-along-with-keshalu/
నూతన నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద కేవలం FASTag లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలి. వాహనానికి చెల్లుబాటు అయ్యే FASTag లేకపోతే, ప్రయాణికులు UPI ద్వారా చెల్లించవచ్చు. అయితే, అటువంటి సందర్భాల్లో సాధారణ టోల్ ఫీజు కంటే 1.25 రెట్లు (25 శాతం అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కొంతమంది తమ గుర్తింపు కార్డులు చూపించి టోల్ కట్టకుండా వెళ్లే పద్ధతికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై కేవలం అర్హత ఉన్న వాహనాలకు మాత్రమే ‘ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్’ అనుమతి ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.
ఒకవేళ ఏదైనా సందర్భాల్లో టోల్ ప్లాజా వద్ద డిజిటల్ చెల్లింపు సాధ్యం కాకపోతే, ఈ-నోటీసు ద్వారా 72 గంటల లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఆ లోపు చెల్లించకపోతే రెట్టింపు జరిమానా విధించనున్నారు. మరోవైపు ఈ మార్పులతో పాటు, ఏప్రిల్ 2026 నుంచి టోల్ ధరలు కూడా 3 శాతం నుండి 5 శాతం వరకు పెరిగాయి. ఈ మేరకు ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందే తమ FASTagను రీఛార్జ్ చేసుకోవాలని లేదా UPI సౌకర్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

