Operation Kagar 500 Maos Killed: మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని అబుజ్‌మాద్, తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు వంటి ప్రాంతాల్లో పోలీసుల కాల్పుల మోతలో ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా, 12 మంది సుక్మా అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో మరణించగా.. గత రెండేళ్లలో ఇప్పటివరకూ 500కి పైగా మావోలు చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
‘ఆపరేషన్ కగార్’తో మావోయిజం ఉనికి కోల్పోతుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ పలువురు కీలక నేతలను కోల్పోగా.. మరికొందరు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయి జనారణ్యంలో కలిసిపోయారు. దీంతో మార్చి 2026నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్.. త్వరలోనే ఈ లక్ష్యాన్ని చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన పోలీసుల కాల్పుల్లో 12 మంది మృతి చెందగా.. గత రెండేళ్లలో చనిపోయిన మావోల సంఖ్య 503కి చేరింది.
Also Read:https://teluguprabha.net/national-news/suresh-gopi-kerala-bjp-double-engine-government/
ఆపరేషన్ కగార్ జనవరి 1, 2024న అధికారికంగా ప్రారంభమైనా.. ఏప్రిల్ 21, 2025న కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన భారీ ఎదురుకాల్పులు కీలక ఘట్టంగా నిలిచింది. కాగా, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి సీనియర్ నాయకులు, సైనిక నాయకుడు మద్వి హిద్మాతో సహా తొమ్మిది మంది సీసీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో పార్టీ భారీ ఎదురుదెబ్బలను చవిచూసింది. ఈ బృందంలో మిగిలిన ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు.. ఒడిశాకు చెందిన గణేష్ ఉయ్కే, మల్లారాజీ రెడ్డి అలియాస్ సంగ్రామ్, అనల్డా అలియాస్ తూఫాన్ ప్రస్తుతం పరాలో ఉన్నట్లు సమాచారం.
ఇక, ముగ్గురు పొలిట్‌బ్యూరో సభ్యుల్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మాజీ ప్రధాన కార్యదర్శి ముపల్ల లక్ష్మణరావు గణపతి ఛత్తీస్‌గఢ్ నుంచి పారిపోయారు. ఇక మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్ జార్ఖండ్‌లో స్థిరపడ్డారు. పొలిట్‌బ్యూరో సభ్యులు వేణుగోపాల్ రావు అలియాస్ సోను, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-assembly-auto-union-protest-krishna-waters-debate/
ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), దాని ఎలైట్ కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), రాష్ట్ర పోలీసులతో సహా సుమారు 1 లక్ష మంది పారామిలిటరీ బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. మావోయిస్ట్ స్థావరాలను గుర్తించేందుకు, ఇంటెలిజెన్స్ సేకరించడానికి డ్రోన్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ వంటి ఆధునిక సాంకేతికత కీలకంగా పనిచేస్తోంది. ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టుల ఉద్యమం బలహీనపడుతోందని, చాలా మంది మావోయిస్టులు సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి మొగ్గు చూపుతున్నారని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి.

