Operation Pimple Success: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. కుప్వాడా జిల్లాలోని కేరన్ సెక్టార్ (Keran Sector)లో భారత సైన్యం ‘ఆపరేషన్ పింపుల్’ (Operation Pimple) ను చేపట్టింది. సరిహద్దు నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటుకు యత్నిస్తున్నారన్న నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా నవంబర్ 7వ తేదీన సైన్యం ఈ సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హతం:
గాలింపు చర్యలు చేపడుతున్న భారత సైన్యానికి చెందిన చినార్ కోర్ దళాలు, అనుమానాస్పద కదలికలను గుర్తించి సవాల్ చేశాయి. దీంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బలగాలు కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని భారత సైన్యం శనివారం ఎక్స్ వేదికగా ధృవీకరించింది. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనని భద్రతా దళాలు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం:
జమ్మూకశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు సరిహద్దుల వెంబడి ఉగ్రమూకలు నిత్యం చొరబాటుకు ప్రయత్నిస్తుండగా, భారత సైన్యం నిఘా, సంయుక్త ఆపరేషన్ల ద్వారా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఈ వారంలోనే కిష్తివాడ్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు ‘ఆపరేషన్ ఛత్రు’ (Operation Chhatru) ను కూడా భద్రతా బలగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సరిహద్దు భద్రత పట్ల, ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారత సైన్యం దృఢ సంకల్పంతో ఉన్నట్లు ఈ వరుస ఆపరేషన్లు స్పష్టం చేస్తున్నాయి.


