ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై నేడు కీలక ప్రకటన వెలువడింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేస్తూ, ఇప్పటివరకు తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్లు ఐఏఎఫ్ అధికార ప్రతినిధులు తెలిపారు. అంతేగాక, ఈ ఆపరేషన్‌లో అన్ని దశలను అత్యంత జాగ్రత్తగా, వివేకంతో చేపట్టినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫేక్ వార్తలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలకే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
ఇక మరోవైపు, ఈ ఆపరేషన్‌కు తాత్కాలిక విరామం తర్వాత ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమీక్షలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. భారత్–పాకిస్తాన్‌ల మధ్య ఇటీవలే ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ కాలరాస్తూ జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ భేటీలో విశ్లేషణ కొనసాగుతోందని సమాచారం.
ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటూ భవిష్యత్తు వ్యూహాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నది భద్రతా వర్గాల అభిప్రాయం. భారత్ శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ, అవసరమైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలను ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పంపిందని విశ్లేషకుల అభిప్రాయం.