ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈమేరకు దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు పంపించేందుకు ఏడుగురు ఎంపీల ప్రతినిధుల బృందాన్ని ఎంపిక చేసింది. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ షిండే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసినట్లు పేర్కొంది.
ఈ ఏడు బృందాలు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలో బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొళి బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్లనుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని చెప్పనున్నారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)తో పాటు వివిధ అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.


