ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో… ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ సైనిక బలగాలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ… వారి ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. దేశ ప్రజల తరఫున సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానంటూ గర్వంగా చెప్పారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు సాధారణ ప్రజలపై, కుటుంబాల ముందే చేసిన హత్యలు తనను వ్యక్తిగతంగా చాలా బాధించాయన్నారు.
ఆపరేషన్ సిందూర్ ఒక బదులుగా కాదు, న్యాయం కోసం చేసిన ప్రతిజ్ఞగా మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కి మన బలగాలు గట్టి బుద్ధి చెప్పారు. ఒక్క దాడితోనే అక్కడి సైన్యంలో కుదుపొచ్చింది. మన దాడి తర్వాత పాకిస్థాన్ తన పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. కానీ అది మొదట మనపై దాడి చేసింది. మన బలగాలు 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను ఖతం చేశాయన్నారు. మిస్సైల్ దాడి ప్రయత్నాన్ని కూడా సమర్థంగా అడ్డుకున్నారని వివరించారు.
మే 10న పాకిస్థాన్ డీజీఎంవో సంప్రదించాడని.. అప్పటికే మన బలగాలు మిషన్‌ను పూర్తిచేశాయని మోదీ తెలిపారు. పాకిస్థాన్ చర్యల ప్రకారమే భారత్ స్పందిస్తుందని స్పష్టం చేశారు. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తలవంచే దేశం కాదని.. ప్రతి దాడికి సమాధానం చెబుతుందని పాకిస్థాన్‌కు స్పష్టమయ్యిందన్నారు. అణు బెదిరింపులకు భారతదేశం భయపడదని.. వాటిని సహించదంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని ప్రసంగం మొత్తం దేశం నిండా దేశభక్తిని రగిలించింది. ఉగ్రవాదంపై భారత్ ధీటుగా పోరాడుతుందన్న నమ్మకాన్ని దేశ ప్రజల్లో బలంగా నాటింది.