Over 2 Lakh Indians Gave Up Citizenship in 2024: గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2024లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించారు.
గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్యలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2020లో 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకోగా, 2021లో ఆ సంఖ్య 1,63,370కి పెరిగింది. 2022లో అత్యధికంగా 2,25,620 మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.
వ్యక్తిగత కారణాలతో..?
పౌరసత్వం వదులుకోవడానికి గల కారణాలు వ్యక్తిగతమైనవని ప్రభుత్వం పేర్కొంది. అయితే, విదేశాల్లో స్థిరపడిన భారతీయులను దేశానికి ఆస్తిగా పరిగణిస్తున్నామని, వారి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దేశ ప్రగతికి ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.4 కోట్ల మంది ప్రవాస భారతీయులు (PIOలు, NRIలు కలిపి) ఉన్నారని అంచనా. ఈ గణాంకాలు దేశంలో మేధోవలసపై చర్చను మరోసారి రేకెత్తించాయి. మెరుగైన అవకాశాలు, జీవన ప్రమాణాల కోసం యువత విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడటం ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.


