ప్రస్తుత యువత జీవితంలో ఓయో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. పబ్బులు, పార్టీలు, మీటింగులు, లేదా చిన్నపాటి ప్రయాణాలు.. ఏ సందర్భమైనా ఓయో ఒక ఎంపికగా మారుతోంది. పల్లెల నుంచి వచ్చిన యువత సిటీలో తాత్కాలిక వసతి కోసం లేదా వారి పనులు పూర్తి చేసుకునేందుకు కూడా ఈ గదులను అద్దెకు తీసుకుంటున్నారు. హోటళ్లు ఎన్నో ఉన్నా, చాలామంది ఓయో వైపే మొగ్గు చూపడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఓయో హోటళ్లు ఎక్కువగా కాలేజీలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండటం, యువతకు ఇవి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటమే ప్రధాన కారణం. అంతేకాదు, చిన్న గదులు, తక్కువ అద్దె, వేగవంతమైన బుకింగ్ ప్రాసెస్, గోప్యతకు ప్రాధాన్యత.. ఇవన్నీ యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓయో మరో కీలక ముందడుగు వేయబోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఐపీఓ ప్రయాణాన్ని ఆలస్యం చేస్తున్న ఈ సంస్థ, 2026 మార్చిలో ప్రాధమిక షేర్ల విక్రయానికి సిద్ధమవుతోంది. గతంలో 2021, 2023లో కూడా ఐపీఓకి ప్రయత్నించినా, సరైన మార్కెట్ స్పందనపై అనిశ్చితి కారణంగా వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. కంపెనీ పనితీరు మెరుగైంది, లాభాలు పెరిగాయి, వ్యాపార విస్తరణ గణనీయంగా పెరిగింది. అందుకే ఈసారి ఖచ్చితంగా ఐపీఓ వరకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓయో..పేరు విని చాలామంది జపాన్ లేదా చైనా కంపెనీ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా భారతీయ బ్రాండ్. ఒక చిన్న స్టార్టప్‌గా ప్రారంభమై యువతను టార్గెట్ చేస్తూ పెద్ద స్థాయికి ఎదిగిన సంస్థ ఇది. కరోనా సమయానికి తక్కువ ఊపుతో సాగినా, ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చి దూసుకుపోతోంది.
ఐపీఓ ద్వారా సుమారు ₹6,700 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో సెబీకి అవసరమైన పత్రాలు సమర్పించనున్నట్టు సమాచారం. ఈ దిశగా జూన్‌లో ఓ బోర్డు సమావేశం జరగబోతోంది. ఇందులో సంస్థలో భారీ వాటా కలిగి ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఆ మీటింగ్‌లో ఐపీఓపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఐపీఓ విజయవంతమైతే, ఓయో మరింత పెట్టుబడులు సమకూర్చుకుని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విస్తరించే అవకాశాలు మెరుగవుతాయి. తక్కువ అద్దెతోపాటు కొత్త ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజీలు ప్రారంభించే వీలూ కంపెనీకి లభిస్తుంది. దీని లాభం నేరుగా కస్టమర్లకే. ప్రస్తుతం ఓయో ఇండియా సహా అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా తదితర 35కి పైగా దేశాల్లో 1.74 లక్షలకు పైగా హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, హోమ్ స్టేలు కలిగి ఉంది. వినియోగదారులకు ఇవి అందుబాటులో ఉండటంతో పాటు, వారి అవసరాలను తీర్చడంలో కూడా ముందుంటున్నాయి.